జవాన్‌ను మింగేసిన మంచు.. చిత్తూరు జిల్లాలో విషాదం

6 Nov, 2021 04:00 IST|Sakshi
హిమాచల్‌ ప్రదేశ్‌ ఉదయ్‌పుర్‌లో మంచు కొండలో విధి నిర్వహణలో కార్తీక్‌ కుమార్‌రెడ్డి (ఫైల్‌)

రోడ్డుపై పడిన మంచును తొలగిస్తుండగా విరిగిపడిన మంచు చరియలు  

హిమాచల్‌ప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన జవాను దుర్మరణం  

శోకసంద్రంలో బంగారువాండ్లపల్లె 

ములకలచెరువు(చిత్తూరు జిల్లా): రోడ్డుకు అడ్డుగా పడిన మంచును తొలగిస్తుండగా మంచు చరియలు విరిగిపడి చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్‌ మృతిచెందాడు. ఈ వార్త తెలిసిన వెంటనే ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లె గ్రామం కన్నీటిపర్యంతమైంది. ఆ జవాన్‌ తల్లి రోదనలు మిన్నంటాయి. పెద్దావుల నారాయణరెడ్డికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు  కార్తిక్‌ కుమార్‌రెడ్డి 2011లో ఇండియన్‌ ఆర్మీ ఎంఈజీ (మద్రాస్‌ ఇంజినీరింగ్‌ గ్రూప్‌)కి ఎంపికయ్యాడు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకుని మొదటిగా జమ్ము–కశ్మీర్‌ రాష్ట్రం శ్రీనగర్‌లో విధుల్లో చేరాడు. అనంతరం అక్కడి నుంచి ముంబైలోని ఆర్మీ సెక్టార్‌కి బదిలీ అయ్యాడు. గతేడాది మే నెలలో తండ్రి నారాయణరెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడు.

తల్లి సరోజమ్మ ఇంటి వద్ద ఉండేందుకు ఇబ్బంది పడుతుండటంతో ఈ ఏడాది మేలో సెలవుపై ఇంటికొచ్చాడు. బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్న అన్నయ్య క్రాంతికుమార్‌రెడ్డికి వివాహం జరిపించి తల్లిని వారి సంరక్షణలో ఉంచి వెళ్లాడు. సరిగ్గా నాలుగు నెలల కిందట ముంబై నుంచి హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఉదయ్‌పుర్‌–టిండి సెక్టార్‌కు బదిలీ అయ్యాడు. దీపావళినాడు గురువారం మంచు చరియలు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో సహచర జవానులతో కలిసి మంచును తొలగించే పనిలో నిమగ్నమయ్యాడు.

సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంచు గడ్డలు జవానులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో కార్తిక్‌కుమార్‌రెడ్డి(29) మృతిచెందాడు. సుమారు 8 గంటల పాటు సహచర జవానులు మంచు గడ్డలను తొలగించి కార్తీక్‌కుమార్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని కీలాంగ్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్మీ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున కార్తీక్‌కుమార్‌రెడ్డి అన్నయ్య క్రాంతికుమార్‌రెడ్డికి ఫోన్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.  కుమారుడు మరణవార్త విన్న తల్లి సరోజమ్మను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.    
(చదవండి: రెండ్రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన )

మరిన్ని వార్తలు