JEE Mains 2023 Result: జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

7 Feb, 2023 09:53 IST|Sakshi

పేపర్‌–1కి 8.6 లక్షల మంది, పేపర్‌–2కి 46 వేలమంది హాజరు

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ తొలివిడత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఫలితాలను ఉంచారు.

జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీవరకు జరిగిన ఈ పరీక్షలకు 9 లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వారిలో పేపర్‌–1 (బీఈ, బీటెక్‌) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్‌–2 (బీఆర్క్, బీప్లానింగ్‌) పరీక్షకు 46 వేల మంది హాజరయ్యారని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. దాదాపు 95.8 శాతం మంది పరీక్షకు హాజరవడం ఇదే తొలిసారని చెబుతున్నారు.

జేఈఈ మెయిన్‌ సెకండ్‌ సెషన్‌ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున తొలిసెషన్‌ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జేఈఈ తొలిసెషన్‌ పరీక్షల ప్రాథమిక కీని ఎన్‌టీఏ ఫిబ్రవరి 1వ తేదీనే విడుదల చేయగా, ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీవరకు అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించింది.

ఏప్రిల్‌ 6 నుంచి జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలు 
ఎన్‌టీఏ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 6 నుంచి 12వ తేదీ వరకు జేఈఈ మెయిన్‌ రెండోవిడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. మార్చి 7వ తేదీవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సెకండ్‌ సెషన్‌కు సంబంధించిన అప్లికేషన్‌ ఫారం " https:// jeemain. nta. nic. in' వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని ఎన్‌టీఏ తెలిపింది.

జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ పరీక్షల సిటీ స్లిప్‌లను మార్చి 3వ వారంలో విడుదల చేయనున్నారు. మార్చి చివరి వారంలో రెండోసెషన్‌ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఎన్‌టీఏ విడుదల చేయనుంది.  

మరిన్ని వార్తలు