హైకోర్టు నూతన సీజేగా నేడు జస్టిస్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం

13 Oct, 2021 02:17 IST|Sakshi
జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకు స్వాగతం పలుకుతున్న కలెక్టర్‌ జె.నివాస్‌

గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం

తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నేటి మధ్యాహ్నం ప్రమాణ స్వీకార కార్యక్రమం

హాజరు కానున్న ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులు, న్యాయమూర్తులు

సాక్షి, అమరావతి/గన్నవరం/విశాఖ లీగల్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌.. జస్టిస్‌ పీకే మిశ్రాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, న్యాయ మూర్తులు, తదితరులు పాల్గొననున్నారు. కాగా, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం నుంచి ఇండిగో విమానంలో విజయవాడలోని గన్నవరం చేరుకున్నారు.

విమానాశ్రయంలో ఆయనకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అమానుల్లా, జస్టిస్‌ డి.రమేష్, జస్టిస్‌ శేషసాయి, జస్టిస్‌ సురేష్‌రెడ్డి, జస్టిస్‌ బట్టు దేవానంద్, పలువురు న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, జిల్లా కలెక్టర్‌ జె.నివాస్, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, హైకోర్ట్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ భానుమతి, హైకోర్టు ప్రొటోకాల్‌ రిజిస్ట్రార్‌ మురళీధర్, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ బాలసుబ్రమణ్యంరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకున్నారు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం 2 గంటలకు రాయపూర్‌ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మ, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, పలువురు అధికారులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.  

మరిన్ని వార్తలు