సాగునీటి సమస్య పరిష్కారం.. మాట నిలబెట్టుకున్న మంత్రి కాకాణి

25 Nov, 2022 17:02 IST|Sakshi

కళ్లెదుట నీరున్నా వాడుకునే పరిస్థితి లేదు

సమస్యను పరిష్కరిస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన కాకాణి

హామీని నిలబెట్టుకున్న మంత్రి గోవర్ధన్‌రెడ్డి

సొంత నిధులతో సాగునీటి కాలువల పునరుద్ధరణ పనులు

సాక్షి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని రామదాసుకండ్రిగ, ఇడిమేపల్లి, గురివిందపూడి గ్రామ పంచాయతీల రైతులు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. సుమారు వంద సంవత్సరాలుగా ఇక్కడి సాగునీటి సమస్యకు పరిష్కారం లభించలేదు. సమీపంలో కనుపూరు కాలువ ఉపకాలువ అయిన గురివిందపూడి బ్రాంచ్‌ కెనాల్‌ ఉంది. ఇందులో సాగునీరున్నా ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడలేదు. ఎట్టకేలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతుల నిరీక్షణకు తెరదించారు. ఆయన తీసుకున్న చర్యలతో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కనుపూరు కాలువ నుంచి అందుబాటులోని చెరువులకు సాగునీరు సరఫరా సాధ్యమైంది. దీంతో అధికారికంగా మూడువేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. అనధికారికంగా మరో రెండువేల ఎకరాలకు నీరందుతుంది. ఈ నేపథ్యంలో ఆయా పంచాయతీల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 

పట్టించుకోని టీడీపీ 
సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అనేక పర్యాయాలు పాలకుల దృష్టికి ఆ మూడు పంచాయతీల రైతులు తీసుకెళ్లారు. చెరువులున్నాయి, జలాశయాల నుంచి నీరు వచ్చే మార్గాలను పునరిద్ధరించాలని ఆభ్యర్థించారు. 22 సంవత్సరాలు పాలించిన టీడీపీ నేతలకు అక్కడి రైతుల విన్నపాలు చెవిక్కెలేదు. వర్షం లేకపోతే భూగర్భ జలాలు అడుగంటిపోయి, తాగునీటికి సైతం ఇబ్బందులు పడేవారు. టీడీపీ హయాంలో తాగునీటి ఇక్కట్లను ప్రజలు చవిచూశారు. ఇలాంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికలు సమీపించాయి. మూకుమ్మడిగా తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముక్తకంఠంతో కోరారు. 


హామీని నిలబెట్టుకున్న మంత్రి 

2019 ఎన్నికలకు ముందు వాస్తవ పరిస్థితిని అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి ఆయా పంచాయతీల ప్రజలు తీసుకెళ్లారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే సొంత నిధులు వెచ్చించి కాలువలను పునరిద్ధరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో వైఎస్సార్‌సీపీ అధికార పగ్గాలు అందుకుంది. మంత్రి కాకాణి రూ.40 లక్షల సొంత నిధులు వెచ్చించి వెంకటాచలంలోని కాకెద్దులగుంటచెరువు నుంచి రామదాసుకండ్రిగ, గురివిండపూడి, ఇడిమేపల్లి చెరువులకు సాగునీరు వెళ్లేలా కాలువల పునరుద్ధరణ పనులు చేయించారు. సుమారు 11 కిలోమీటర్లు పొడవున్న కాలువ పనులను 16 రోజులపాటు రేయింబవళ్లు 12 మెషీన్లతో చేశారు. నేడు కాలువల్లో నీళ్లు రావడంతో రైతుల ఆనందం హద్దులు దాటింది. అక్కడి నుంచి చెరువులకు నీరు విడుదల చేశారు. రామదాసుకండ్రిగ చెరువు పరిశీలనకు వెళ్లిన మంత్రి గోవర్ధన్‌రెడ్డికి రైతాంగం బ్రహ్మరథం పట్టారు. గుర్రపు బండిపై తీసుకెళ్లి తమ సంతోషాన్ని బాహాటంగా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణిని ఘనంగా సన్మానించారు. 


జీవింతాం గుర్తించుకుంటాం 

రామదాసుకండ్రిగ రైతుల ఎన్నో ఏళ్ల నాటి కలను మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సాకారం చేశారు. ఎంతోమంది మా గ్రామానికి వచ్చి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ అందరిలా కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన మంత్రిని ఎప్పటికీ మర్చిపోలేం. జీవితాంతం గుర్తించుకుంటాం. 
– షేక్‌ షాజహాన్, మాజీ సర్పంచ్, రామదాసుకండ్రిగ


బిడ్డల భవిష్యత్‌ బాగుంటుంది 

చెరువు ఆయుకట్టు భూమి ఉన్నా.. నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఏళ్ల తరబడి భూములు బీడుగా మారాయి. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చొరవతో మా బిడ్డల భవిష్యత్‌ బాగుంటుంది. సాగునీటి కాలువను తవ్వించి, చెరువులకు నీటిని విడుదల చేయడం సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఏడాది ఎలాంటి కష్టాలు లేకుండా పంటలు పండించుకుంటాం. 
– వెడిచర్ల సుబ్రహ్మణ్యం, రైతు 


శాశ్వత పరిష్కారం లభించింది 

చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి సంవత్సరం సాగునీటి సమస్యలతో పంటలు పండేవి కావు. మూడేళ్ల నుంచి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధతో కొంతమేరకు పంటలు పండించుకున్నాం. ఇప్పుడు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. చెరువులకు నీరు విడుదల చేయడంతో ఇక మాకు నీటి కష్టాలుండవు. సాగునీటి సమస్యను పరిష్కరించిన మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం. 
– వాకా సుబ్బారావు, రైతు

మరిన్ని వార్తలు