చంద్రబాబు మొసలి కన్నీరు చూసి మోసపోవద్దు: మంత్రి కాకాణి

5 Nov, 2023 11:49 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: రైతులను రెచ్చగొట్టేవిధంగా ఎల్లో మీడియా కుట్రలు చేస్తుందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అసత్య ప్రచారంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగు రైతు స్టీరింగ్ కమిటీ పేరుతో ఏముఖం పెట్టుకుని రైతుల దగ్గరికి వెళ్తున్నారో చెప్పాలంటూ టీడీపీ నేతల్ని మంత్రి దుయ్యబట్టారు.

‘‘అన్ని రకాలుగా అన్నదాతలను చంద్రబాబు మోసం చేశారు. కొత్త ఎత్తుగడలతో మరోసారి రైతుల ముందుకు వస్తున్నారు. చంద్రబాబు మొసలి కన్నీరు చూసి మోసపోవద్దు’’ అని కాకాణి పేర్కొన్నారు.

‘‘టీడీపీ హయాంలో రైతులను అడుగడుగునా దోచుకున్న మాట వాస్తవం కాదా? అని కాకాణి ప్రశ్నించారు. ఖరీఫ్, రబీలో ఏ పంటలు పండిస్తారో కుడా పరిజ్ఞానం లేని లోకేష్.. లేఖలు రాయడం సిగ్గు చేటు. రాష్టంలో కరువు రావాలని కోరుకున్న వ్యక్తి రామోజీరావు.. అందుకే విధి విధానాలు తెలియకుండానే.. కరువు మండలాలు ప్రకటించాలని వార్తలు రాస్తున్నారు’’ అని మంత్రి  నిప్పులు చెరిగారు.

‘‘నష్టపోయిన రైతులు అందరూ ఉచిత పంటల బీమా కింద లబ్ధి పొందుతున్నారు. పచ్చ మీడియా రాతలకూ రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖరీఫ్ పంట నైరుతి రుతు పవనాల మీద ఆధారపడి ఉంటుంది. వర్షపాతం తక్కువగా ఉండటంతో పంట కొంత విస్తీర్ణం తగ్గింది. నీరందక పంట నష్టపోయిన వారికీ పంటల బీమాను అందిస్తున్నాం. 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాం.. రబీ కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేశాం. రైతు భరోసా రైతులకు ఇచ్చాం.. 7వ తేదీన మరోసారి ఇస్తున్నాం’’ అని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు.
చదవండి: ‘ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురందేశ్వరి’

మరిన్ని వార్తలు