Minister Kakani Govardhan: వ్యవసాయ మంత్రిగా కాకాణి బాధ్యతలు.. తొలి రెండు సంతకాలు వాటిపైనే..

21 Apr, 2022 10:16 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం.. రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇర్రిగేషన్ అవకాశం కల్పించే ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. 3,500 ట్రాక్టర్లని వైఎస్సార్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైల్‌పై రెండో సంతకం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'వ్యవసాయ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.43 వేల కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించాం. సీఎం జగన్ రైతు పక్షపాతి. రూ.20 వేల కోట్లకు పైగా రైతు భరోసా కింద ఇప్పటివరకూ నగదు బదిలీ చేశాం. గన్నవరలో స్టేట్ సీడ్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆర్బీకేల ద్వారా రైతుల అవసరాలు తీర్చేలా పీఏసీ ఖాతాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించాం. రైతుల నగదు లావాదేవీలు కూడా ఆర్బీకేలలో జరిగేలా చర్యలు చేపట్టాం. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని' ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

చదవండి: (మంత్రిగా గుడివాడ అమర్‌నాథ్‌ బాధ్యతలు.. తొలి సంతకం దానిపైనే..)

మరిన్ని వార్తలు