147 చోట్ల 'అగ్రి' ప్రయోగశాలలు

14 Jun, 2021 03:47 IST|Sakshi
కాకినాడ రూరల్‌ వాకలపూడిలో సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి కన్నబాబు, ఎంపీ గీత, ఎమ్మెల్సీ రవీంద్ర

జూలై 8 రైతు దినోత్సవం రోజున 61 చోట్ల ప్రారంభం: వ్యవసాయ మంత్రి కన్నబాబు

కాకినాడ రూరల్‌: రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 147 నియో జకవర్గాల్లో వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ ల్యాబ్‌) నిర్మిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ వాకలపూడి వద్ద బీచ్‌ రోడ్డును ఆనుకుని రూ.82 లక్షలతో నిర్మించనున్న నియోజకవర్గ స్థాయి వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తోందని, ఆ రోజు మొదటి దశ కింద 61 ప్రయోగశాలలను ప్రారంభిస్తామని వివరించారు.

రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందించేందుకే ఈ ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తున్నామని మంత్రి వివరించారు. అలాగే, కల్తీలను నివారించడానికి ప్రతి జిల్లాలో ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తున్నామని మంత్రి చెప్పారు.  ఇక రైతు దినోత్సవం రోజున మొదటి దశ రైతుభరోసా కేంద్రాలను కూడా ప్రారంభిస్తామని కన్నబాబు వెల్లడించారు. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. యంత్ర పరికరాలు ఎలా వాడితే లాభాలు పొందవచ్చో రైతులకు అవగాహన కల్పించేందుకు సామర్లకోట, శ్రీకాకుళంలోని నైరా, రాయలసీమల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామని కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు