-

కుక్కను తప్పించబోయి అదుపు తప్పిన కారు.. ఒక వ్యక్తి మరణం

28 Nov, 2023 12:12 IST|Sakshi

అడ్డాకుల: కర్నూల్‌ జిల్లాకు చెందిన రామయ్య(80) తన సోదరుడు, మరో డ్రైవర్‌తో కలిసి కారులో హైదరాబాద్‌ వెళ్తున్నారు. శాఖాపూర్‌ దాటిన తర్వాత పాత రోడ్డు సమీపంలో కారుకు అడ్డుగా కుక్క వచ్చింది. దీంతో దాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్‌ కారును పక్కకు తిప్పగా.. కారు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. అందులోని రామయ్య తీవ్రంగా గాయపడ్డాడు.

మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. రామయ్యను ఎల్‌అండ్‌టీ అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందారని అక్కడి వైద్యులు చెప్పినట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ మాధవరెడ్డి తెలియజేశారు.

విద్యుదాఘాతంతో రైతు..
మహబూబ్‌నగర్‌ రూరల్‌:
మండల పరిధిలోని మనికొండలో పెండెం చంద్రశేఖర్‌(49) విద్యుదాఘాతంతో మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు ఆదివారం ఉదయం తన ఇంట్లో స్విచ్‌ బోర్డు వద్ద ఆన్‌ఆఫ్‌ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు సర్పంచ్‌ గంగాపురి తెలియజేశారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకొని పేద కుటుంబానికి అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మద్యం దుకాణం సీజ్‌
మహబూబ్‌నగర్‌ క్రైం:
జిల్లా కేంద్రంలోని న్యూబాలాజీ మద్యం దుకాణాన్ని ఆదివారం రాత్రి ఎన్నికల వ్యయ పరిశీలకుడు, ఐఆర్‌ఎస్‌ అధికారి కుందన్‌యాదవ్‌ తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ఎక్కువ మొత్తంలో మద్యం విక్రయించినట్లు గుర్తించారు. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎకై ్సజ్‌ ఈఎస్‌ సైదులు, సీఐ వీరారెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్‌ మద్యం దుకాణంలో స్టాక్‌ పరిశీలించి సీజ్‌ చేశారు. సదరు దుకాణాదారుడి లైసెన్స్‌ రద్దు చేశారు. దుకాణంలో రూ.8లక్షల విలువగల స్టాక్‌ ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా రెండు రోజుల కిందట జహంగీర్‌ అనే వ్యక్తి రూ.2లక్షల విలువగల మద్యాన్ని ఆటోలో తరలిస్తుండగా, పట్టుకుని సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

భారీగా మద్యం పట్టివేత
చిన్నంబావి: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని దగడపల్లిలో రూ.4లక్షల విలువగల 47 కాటన్ల మద్యాన్ని పట్టుకున్నట్లు ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తెలిపారు. దగడపల్లికి చెందిన వెంకట్రావు ఇంట్లో 29 కాటన్లు, కుమ్మరి రమేష్‌ ఇంట్లో 3 కాటన్లు, కుమ్మరి శంకరయ్య ఇంట్లో 17 కాటన్ల మద్యం నిల్వ చేయగా, స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్‌ సీఐ కళ్యాణ్‌, స్పెషల్‌ పార్టీ పోలీస్‌ రవినాయక్‌, వీపనగండ్ల ఎస్‌ఐ రవికుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు