ఉద్దానం కిడ్నీకి రక్షణ కవచం 

23 Nov, 2023 05:44 IST|Sakshi

కిడ్నీ బాధితులకు వైద్యం మరింత చేరువ 

త్వరలో పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ హాస్పిటల్‌ ప్రారంభం 

వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ హాస్పిటల్‌గా నామకరణం చేసిన ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను సీఎం జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌కు “డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ హాస్పిటల్‌’గా నామకరణం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కిడ్నీ బాధితులకు కార్పొరేట్‌ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో రూ.50 కోట్లు వెచ్చించి రీసెర్చ్‌ ఆస్పత్రిని నిర్మి0చారు. ర్యాంప్‌ బ్లాక్‌తో కలిపి మూడు బ్లాక్‌లుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. మొదటి అంతస్తులో క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, హాస్పిటల్‌ స్టోర్స్, సెంట్రల్‌ ల్యాబ్స్‌ ఉంటాయి. రెండో అంతస్తులో నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్‌ మెడిసిన్, సర్జరీ, మూడో అంతస్తులో డయాలసిస్, నెఫ్రాలజీ వార్డులు, నాలుగో అంతస్తులో ఓటీ కాంప్లెక్స్, పోస్ట్‌ ఆపరేటివ్‌/ఐసీయూ, యూరాలజీ వార్డ్స్, రీసెర్చ్‌ ల్యాబ్స్‌ ఉంటాయి. 

అందుబాటులో అన్నిరకాల చికిత్సలు 
కిడ్నీ వ్యాధులకు సంబంధించి అన్నిరకాల చికిత్సలతో పాటు పరిశోధనలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పరికరాలను సమకూరుస్తోంది. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్‌ కలర్‌ డాప్లర్, మొబైల్‌ ఎక్సరే (డిజిటల్‌), ఏబీజీ అనలైజర్‌ పరికరాలతో పాటు పూర్తిగా రిమోట్‌ కంట్రోల్‌ ఐసీయూ సౌకర్యాలను కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌లో అందుబాటులోకి రానున్నాయి.

జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, వంటి వివిధ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్య పోస్టులు 46, స్టాఫ్‌ నర్సు పోస్టులు 60, ఇతర సహాయ సిబ్బంది పోస్టులు 60 చొప్పున మంజూరు చేశారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. త్వరలోనే సీఎం జగన్‌ చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించనున్నట్టు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు. 
 
ఇప్పటికే తీసుకున్న చర్యలివీ 
♦ గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 చొప్పున ఇచ్చే పెన్షన్‌ను సీఎం జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.10వేలకు పెంచింది. ప్రతినెలా 1వ తేదీనే లబి్ధదారుల గుమ్మం చెంతకు రూ.10 వేల చొప్పున పెన్షన్‌ను వలంటీర్లు అందజేస్తున్నారు. 
♦ టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 69 మెషిన్లతో డయాలసిస్‌ సేవలు అందిస్తున్నారు. హరిపురంలో డయాలసిస్‌ సెంటర్‌ను 2020లో ప్రారంభించారు. మరో 25 మెషిన్లతో కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్‌ సెంటర్లు మంజూరయ్యాయి. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020–21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో (మే నాటికి) 55,708 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ చేశారు. 
♦  ఇచ్చాపురం, కంచిలీ సీహెచ్‌సీ, కంచిలి పీహెచ్‌సీల్లో 25 మెషిన్లతో డయాలసిస్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 
♦ వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సె­మీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్‌ ఎనలైజర్స్, యూ­రిన్‌ ఎనలైజర్స్‌ను అందుబాటులో ఉంచారు. 
♦ టీడీపీ హయాంలో డయాలసిస్‌ రోగులకు 20 రకాల మందులు మాత్రమే అరకొరగా ఇక్కడి ఆస్పత్రుల్లో అందించేవారు. ప్రస్తుతం ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి.  
♦కొత్త కేసుల గుర్తింపునకు వైద్య శాఖ నిరంతరాయంగా స్క్రీనింగ్‌ కొనసాగిస్తోంది. ఇందుకోసం వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌వో)లకు ప్రత్యేకంగా ఒక యాప్‌ రూపొందించారు. వీరు ఈ ప్రాంతంలోని ప్రజలను స్క్రీనింగ్‌ చేసి అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సమీపంలోని పీహెచ్‌సీలకు సీరమ్‌ క్రియాటినిన్‌ పరీక్షలకు తరలిస్తున్నారు.

మరిన్ని వార్తలు