గుళ్లలోని క్షురకులకు రూ.20 వేల కనీస ఆదాయం

11 Oct, 2022 04:06 IST|Sakshi

ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

టికెట్ల ద్వారా నెలకు రూ.20 వేల కన్నా తక్కువ వస్తే.. మిగిలిన మొత్తం అందేలా చర్యలు

ఎక్కువ వస్తే వారికే చెందుతుందని స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రధాన ఆలయాల్లోని కేశఖండనశాలల్లో క్షురకులుగా పనిచేసే వారికి ప్రతి నెలా కనీసం రూ.20 వేలు ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ధార్మిక పరిషత్‌ తొలి సమావేశం సోమవారం ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది.

అనంతరం సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రధాన ఆలయాల్లోని క్షురకులు ప్రస్తుతం టికెట్ల ఆధారంగా ప్రతి నెలా ఆదాయం పొందుతున్నారని చెప్పారు. వాళ్లకు నెలకు రూ.20 వేల కంటే తక్కువ ఆదాయం దక్కే సమయంలో.. ఆయా ఆలయాల్లోని వెల్ఫేర్‌ ట్రస్టు ద్వారా మిగిలిన మొత్తాన్ని ఇప్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ తమకు సూచించారని పేర్కొన్నారు. రూ.20 వేల కంటే ఎక్కువ ఆదాయం వస్తే.. వారికే ఆ మొత్తం చెందుతుందన్నారు.

తక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఆ మొత్తాన్ని అదనంగా అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. సమావేశంలో హథీరాంజీ, బ్రహ్మంగారి మఠం,అహోబిలం, గాలి గోపురం, బ్రహ్మానంద మఠాలకు సంబంధించిన పాలనపరమైన అంశాలపైనా చర్చించినట్టు చెప్పారు.  బెజవాడ దుర్గ గుడిలో అంతరాలయ దర్శన టికెట్‌ ధర ఎప్పటి నుంచో రూ.500గానే ఉందన్నారు. 

మరిన్ని వార్తలు