AP: శ్రీశైలం, సాగర్‌ తక్షణమే అప్పగించండి

8 Nov, 2021 08:16 IST|Sakshi

రెండు రాష్ట్రాల సీఎస్‌లకు కృష్ణా బోర్డు చైర్మన్‌ లేఖ 

6 అవుట్‌లెట్లను అప్పగిస్తూ గత నెల 14న ఏపీ ఉత్తర్వులు 

9 అవుట్‌లెట్లపై ఇప్పటిదాకా ఉత్తర్వులివ్వని తెలంగాణ

సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతోపాటు వాటి నుంచి నేరుగా నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను (అవుట్‌లెట్లు) తక్షణమే అప్పగించాలని తెలుగు రాష్ట్రాలను కృష్ణా బోర్డు చైర్మన్‌ మహేంద్రప్రతాప్‌సింగ్‌ ఆదేశించారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు ఆయన తాజాగా లేఖలు రాశారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖ జూలై 15న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను గత నెల 14 నుంచే అమలు చేయాల్సి ఉందని గుర్తు చేశారు.

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు కోసం రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల అధికారులు, జెన్‌కో అధికారులతో పలుదఫాలు చర్చలు జరిపామని, సబ్‌ కమిటీలను ఏర్పాటు చేశామని లేఖలో ప్రస్తావించారు. నోటిఫికేషన్‌ ప్రకారం షెడ్యూల్‌–2లో పొందుపరిచిన ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి తీసుకుని నిర్వహించాలన్నారు. షెడ్యూల్‌–3లో ఉన్న ప్రాజెక్టులను కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించుకోవాలన్నారు. బోర్డు నిర్వహణ కోసం సీడ్‌ మనీ కింద ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున కృష్ణా బోర్డు ఖాతాలో జమ చేయాలని సూచించారు.

లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. 
గత నెల 12న జరిగిన బోర్డు సమావేశంలో శ్రీశైలం, సాగర్‌లతో గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలును ప్రారంభించడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయి.
► శ్రీశైలం స్పిల్‌ వే, కుడి గట్టు విద్యుత్కేంద్రం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీ–నీవా(మల్యాల, ముచ్చుమర్రి పంప్‌హౌస్‌), సాగర్‌ కుడి కాలువ విద్యుత్కేంద్రాలను బోర్డుకు అప్పగిస్తూ గత నెల 14నే ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల, సాగర్‌ స్పిల్‌ వే, ప్రధాన విద్యుత్కేంద్రం, ఏఎమ్మార్పీ, సాగర్‌ వరద కాలువ, సాగర్‌ ఎడమ కాలువ హెడ్‌ రెగ్యులేటర్, విద్యుత్కేంద్రం, సాగర్‌ కుడి కాలువలను తెలంగాణ సర్కార్‌ నుంచి స్వాధీనం చేసుకున్నప్పుడే తమ ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకోవాలని ఏపీ సర్కార్‌ షరతు విధించింది. 
► తెలంగాణ సర్కార్‌ ఇప్పటిదాకా 9 అవుట్‌లెట్లను బోర్డుకు స్వాధీనం చేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేదు. 
► నోటిఫికేషన్‌ అమలుకు వీలుగా తక్షణమే శ్రీశైలం, సాగర్‌లను బోర్డుకు అప్పగిస్తూ రెండు రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేయాలి. వాటి కార్యాలయాలు, సిబ్బంది, వాహనాలను కూడా బోర్డుకు అప్పగించాలి.

మరిన్ని వార్తలు