జగనన్న ఆరోగ్య సురక్షతో అందరికీ రక్ష

17 Sep, 2023 04:27 IST|Sakshi

స్పెషలిస్టు వైద్యులతో స్థానికంగానే పరీక్షలు 

నిఫా వైరస్‌పై అప్రమత్తం 

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని 

సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష పథకం రాష్ట్ర ప్రజలందరికీ రక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. దీనిని బట్టి తమ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత బలోపేతం చేసిందో, ఏ స్థాయిలో వైద్య సేవలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు.

ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య విధానం ద్వారా ఇప్పటివరకు 2.30 కోట్ల ఓపీలు నమోదయ్యాయని చెప్పారు. ఇది ఒక చరిత్రగా అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.8,500 కోట్ల ఖర్చుతో కొత్తగా 17 మెడికల్‌ కళాశాలలు నిర్మిస్తోందని, వీటిలో ఐదింటిని సీఎం జగన్‌ శుక్రవారం పారంభించారని గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లలో మిగిలిన 12 కళాశాలలను కూడా పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు. 

సంక్షేమ రాడార్‌ నుంచి తప్పించుకోకుండా.. 
జగనన్న సంక్షేమ రాడార్‌ నుంచి ఎవరూ తప్పించుకోకూడదనే లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపుదిద్దుకుందని మంత్రి రజని చెప్పారు. మొ­దటి దశలో వలంటీర్ల ఇంటింట సర్వే ఈ నెల 15న ప్రారంభమైందని, స్థానిక ప్రజా ప్రతినిధులు, వలంటీర్లు, ఎన్‌ఎస్‌ఎస్, స్వ­చ్ఛంద సంస్థల కార్యకర్తలు తొలి దశలో గ్రా­మాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్టు మంత్రి చెప్పారు. సీహెచ్‌వో లేదా ఏఎన్‌ఎం ఆ ఇంటికి ఎప్పుడు వస్తారనే విషయాన్ని వలంటీర్లు సమాచారం ఇస్తారన్నారు. రెండో దశలో సీహెచ్‌వో, ఏఎన్‌ఎంలు ప్రజల ఇళ్లకే వెళ్లి అందించే సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయన్నారు.

ప్రజల అంగీకారం మేరకు బీ­పీ, మధుమేహం, హిమోగ్లోబిన్‌ వంటి ఏడు రకాల పరీక్షలను ఇంటివద్దే చేస్తారన్నారు. మూడో దశలో వలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సేవాభావం గల వ్యక్తుల బృందాలు మరోసారి ఇంటింటికీ వెళ్లి గ్రా­­మంలో వైద్య శిబిరం నిర్వహించే తేదీ, అందించే సేవలను వివరిస్తారన్నారు. నాలుగో దశలో ఈ నెల 30న వైద్య శిబిరాలు మొదలుపెట్టి.. 45 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్టు మంత్రి రజి­ని వివరించారు. శిబిరాల్లో రోగులను పరీక్షించి, అవసరమైన వారికి మందులు ఇస్తారని, చికిత్స అవ­సరమైతే వారిని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తారన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో, తహసీ­ల్దా­ర్, పీహెచ్‌సీల వైద్యాధికారులు.. పట్టణాల్లో మునిసిపల్‌ కమిషనర్లు, మునిసిపల్‌ ఆరోగ్య అధికారులు, యూ­పీహెచ్‌సీల వైద్యాధికారులు వైద్య శిబిరాల బా­ధ్య­త తీసుకుంటారన్నారు. ఐదో దశలో ఆ గ్రామానికి చెందిన ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వో, ఏఎన్‌ఎంలు రిఫరల్‌ కేసులకు సంబంధించిన రోగులకు ఫాలోఅప్‌ వైద్యం అందిస్తారన్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో రో­గులకు సరైన వైద్యం అందిందా లేదా.. రోగం పూర్తిగా అదుపులోకి వచ్చిందా లేదా పరిశీలిస్తారని వివరించారు.   

నిఫా వైరస్‌పై అప్రమత్తం 
నిఫా వైరస్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి రజని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. నకిలీ మందుల విషయంలో కఠినంగా ఉన్నామని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీజీ సీట్ల విషయంలో నకిలీ ఎల్వోపీలపై విచారణ కొనసాగుతోందని, ఇది పూర్తిగా ఎన్‌ఎంసీ పరిధిలోని అంశం అవడంతో వారి ద్వారా విచారణ కోరినట్టు పే­ర్కొ­న్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కార్యదర్శి మంజుల, ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, డీహెచ్‌ రామిరెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు