మేధస్సు పరుగులు 

7 Sep, 2020 08:08 IST|Sakshi

మూడెకరాల సాగుకు సొంతంగా ట్రాక్టర్‌ తయారీ 

పెద్దపప్పూరు: పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు పెద్దపప్పూరు మండలం పెద్దయక్కలూరు గ్రామానికి చెందిన హబీబ్‌బాషా. వృత్తి పరంగా మోటార్‌ రీవైండింగ్, లేత్‌ వర్క్, వెల్డింగ్‌ పనులు చేస్తున్న ఇతను చదువుకుంది తొమ్మిదో తరగతి మాత్రమే. తనకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయ పనుల కోసం సొంతంగా ఓ యంత్రాన్నే తయారు చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా ఏడాది పాటు శ్రమించి రూ.60 వేల ఖర్చుతో ఓ మినీ ట్రాక్టర్‌నే సిద్ధం చేశాడు. ఇందు కోసం గ్రామాలన్నీ వెదికి మూలన పడేసిన ఓ డీజిల్‌ ఇంజన్‌ను రూ.8,500కు కొనుగోలు చేశాడు. తర్వాత కమాండర్‌ జీప్‌కు వచ్చే గేర్‌ బాక్స్‌ను కూడా సమకూర్చుకుని నెలల పాటు శ్రమించి తన వర్క్‌షాప్‌లో ఈ ట్రాక్టర్‌కు రూపకల్పన చేశాడు.

దీని సాయంతో తన మూడు ఎకరాల పొలంలో వ్యవసాయ పనులను విజయవంతంగా చేసి చూపించాడు. తెగుళ్ల నివారణకు పురుగు మందులను పిచికారీ చేసి తన తయారీకి తిరుగులేదని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ వాహనాన్ని రైతులకు అందుబాటులో ఉంచాడు. ఎవరైనా రైతులు సంప్రదిస్తే తక్కువ బాడుగకు అందజేస్తున్నాడు. రూ.400 డీజిల్‌ వేసుకుంటే ఆరు గంటల పాటు వ్యవసాయ పనులు చేసుకోవచ్చని హబీబ్‌బాషా చెబుతున్నాడు. అన్నీ బాగున్నా.. ఈ వాహనానికి లైటింగ్‌ సమస్య ఒక్కటే వేధిస్తోందని, త్వరలో అధిగమిస్తానంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
 

మరిన్ని వార్తలు