Rajasthan: భూవివాదంలో ఘోరానికి పాల్పడ్డ అన్న.. చచ్చేదాకా!

25 Oct, 2023 15:43 IST|Sakshi

క్రైమ్‌: అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఘోరానికి దారి తీసింది. వరుసకు తమ్ముడు అయ్యే వ్యక్తిని.. కోపంలో కసి తీరా ట్రాక్టర్‌తో తొక్కి చంపాడు ఓ వ్యక్తి. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఈ ఘోరం జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్‌ అవుతోంది.  

బహదూర్‌ సింగ్‌, అతర్‌ సింగ్‌ అన్నదమ్ములు. చాలా కాలంగా భరత్‌పూర్‌లోని ఉన్న కాస్త భూమి కోసం కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాలు కొట్లాడుకుంటున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం బహదూర్‌ కుటుంబం వివాదాస్పద స్థలంలోకి ట్రాక్టర్‌తో వచ్చింది. ఆ విషయం తెలిసి కాసేపటికే అతర్‌ సింగ్‌ కుటుంబం అక్కడికి చేరుకుంది. 

ఈ క్రమంలో రెండు కుటుంబాలు కర్రలతో పరస్పర దాడులకు దిగాయి. ఈ క్రమంలో అతార్‌ సింగ్‌ కొడుకు నిర్పత్‌ కిందపడిపోగా.. అది గమనించిన బహదూర్‌ కొడుకు దామోదర్‌ ట్రాక్టర్‌ను నిర్పత్‌ మీదుగా పోనిచ్చాడు. 

నిర్పత్‌ వరుసకు దామోదర్‌కు తమ్ముడు అవుతాడు. తమ్ముడిని ఏం చేయొద్దని అక్కడున్న కుటుంబ సభ్యులు బతిమాలుతున్నా.. దామోదర్‌ వెనక్కి తగ్గలేదు. నిర్పత్‌ మీద నుంచి ముందుకు వెనక్కి ట్రాక్టర్‌ను ఎక్కించి తొక్కించాడు. చనిపోయాడని నిర్ధారించుకునేదాకా దామోదర్‌ ఆ ఘోరాన్ని ఆపలేదు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. 

వీడియో కోసం క్లిక్‌ చేయండి

ఈ ఘర్షణలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజుల క్రితమే ఈ రెండు కుటుంబాలు గొడవ పడ్డాయని.. ఆ ఘర్షణలో బహదూర్‌ సింగ్‌, ఆయన కుటుంబానికి చెందిన మరో వ్యక్తికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటనకు సంబంధించి అతర్‌ సింగ్‌ తో పాటు నిర్పత్‌పైనా కేసు నమోదు అయ్యింది. 

తుపాకీ మోత వినిపించిందని స్థానికులు చెబుతున్నప్పటికీ.. పోలీసులు ఆ విషయాన్ని ధృవీకరించలేదు. మరోవైపు ఈ ఘటన రాజకీయ విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రియాంక గాంధీని ఈ ఘటనలో జోక్యం చేసుకోవాలని పలువురు కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తలు