మన దౌత్యం...కొత్త శిఖరాలకు

27 Sep, 2023 05:22 IST|Sakshi
ప్రగతిమైదాన్‌లోని భారత్‌ మండపంలో జరిగిన కార్యక్రమ వేదికపై ప్రధాని మోదీ

ప్రపంచగతినే మలుపు తిప్పే నిర్ణయాలకు వేదికైన జీ20 

దూసుకెళ్తున్న నయా భారత్‌ 

గత 30 రోజుల పరిణామాలే నిదర్శనం 

చంద్రయాన్‌ నుంచి జీ 20 దాకా ఎన్నో దిగ్విజయాలు 

ప్రధాని ’మంత్లీ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌’

న్యూఢిల్లీ: గత నెల రోజుల్లో భారత దౌత్య ప్రతిభ నూతన శిఖరాలను తాకిందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 21వ శతాబ్దిలో ప్రపంచ గతిని నిర్ణయించే పలు కీలక నిర్ణయాలకు ఢిల్లీ వేదికగా ఇటీవల జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు వేదికైందన్నారు. నేటి భిన్న ధ్రువ ప్రపంచంలో అన్ని దేశాలను ఒకే వేదిక మీదికి తేవడం చిన్న విషయమేమీ కాదన్నారు.

‘దేశ వృద్ధి ప్రస్థానం నిర్నిరోధంగా సాగాలంటే స్వచ్ఛమైన, స్పష్టమైన, సుస్థిరమైన పాలన చాలా ముఖ్యం. ప్రస్తుతం దేశంలో చోటుచేసుకుంటున్న సానుకూల పరిణామాలు, మార్పులకు రాజకీయ స్థిరత్వం, విధాన స్పష్టత, పాలనలో ప్రతి అడుగులోనూ పాటిస్తున్న ప్రజాస్వామిక విలువలే ప్రధాన కారణం‘ అని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఇక్కడ జీ20 కనెక్ట్‌ లో విద్యార్థులు, బోధన సిబ్బంది, విద్యా సంస్థల అధిపతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అవినీతిని, వ్యవస్థలో లీకేజీలను అరికట్టేందుకు, దళారుల జాడ్యాన్ని నిర్మూలించేందుకు, పథకాల అమలుకు టెక్నాలజీని గరిష్టంగా వాడుకునేందుకు గత తొమ్మిదేళ్లలో తమ సర్కారు చిత్తశుద్ధితో ప్రయతి్నంచిందని చెప్పారు. 

భారత్, ద హ్యాపెనింగ్‌ ప్లేస్‌! 
భారత్‌ ఇప్పుడు ఎన్నో కీలక సంఘటనలకు వేదికగా మారుతోందని మోదీ అన్నారు. ‘గత నెల రోజుల ఘటనలే ఇందుకు నిదర్శనం. దానిపై ప్రగతి నివేదిక ఇవ్వదలచుకున్నా. అప్పుడు నూతన భారతం వృద్ధి పథంలో పెడుతున్న పరుగుల తాలూకు వేగం, తీవ్రత అర్థమవుతాయి. గత నెల వ్యవధిలో నేను ఏకంగా 85 దేశాల అధినేతలతో భేటీ అయ్యా. ఇక ఆగస్టు 23ను మనమెప్పటికీ గుర్తుంచుకోవాలి. అది భారత్‌ సగర్వంగా చంద్రుని మీద అడుగు పెట్టిన రోజు. ప్రపంచమంతా మన వాణిని విన్న రోజు. మనందరి పెదవులపై గర్వంతో కూడిన దరహాసం వెలిగిన రోజు.

అందుకే జాతీయ అంతరిక్ష దినంగా ఆగస్ట్‌ 23 మన దేశ చరిత్రలో అజరామరంగా నిలవనుంది. ఆ విజయపు ఊపులో వెనువెంటనే సౌర యాత్రకు మనం శ్రీకారం చుట్టాం‘ అన్నారు. ఇక మామూలుగా కేవలం ఒక దౌత్య భేటీగా జరిగే జీ20 సదస్సును మన ప్రయత్నాలతో పౌర భాగస్వామ్యంతో కూడిన జాతీయ ఉద్యమంగా మలచుకున్నాం. ఢిల్లీ డిక్లరేషన్‌కు జీ20 దేశాల నుంచి 100 శాతం ఏకాభిప్రాయం దక్కడం ప్రపంచ స్థాయిలో పతాక శీర్షికలో నిలిచింది. ఆఫ్రికన్‌ యూనియన్‌ జీ20లో శాశ్వత సభ్య దేశంగా చేరింది. ఇలాంటివన్నీ ఆ సదస్సు సారథ్య సందేశంగా మనం సాధించిన ఘనతలే. అంతేకాదు, భారత ప్రయత్నాల వల్ల మరో ఆరు దేశాలు బ్రిక్స్‌ కూటమిలో చేరాయి‘ అని వివరించారు.  

వీరికి అందలం, వారికి అరదండాలు! 
నేడు మన దేశంలో నిజాయితీపరులకు గుర్తింపు, అవినీతిపరులకు తగిన శిక్ష దక్కుతున్నాయని మోదీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మధ్య తరగతి శ్రేయస్సు కోసం గత నెల రోజుల్లో కేంద్రం ఎన్నో పథకాలు తెచ్చింది. పీఎం విశ్వకర్మ యోజన, రోజ్‌ గార్‌ మేళాతో లక్ష మంది యువతకు ఉపాధి వంటివన్నీ వాటిలో భాగమే‘ అన్నారు. ‘మన దేశం మీద అంతర్జాతీయంగా భరోసా ఇనుమడిస్తోంది. విదేశీ పెట్టుబడుల వెల్లువ రికార్డులు తాకుతోంది. కేవలం ఐదేళ్లలో 13.5 కోట్ల భారతీయులు పేదరికం నుంచి బయటపడి నూతన మధ్య తరగతిగా రూపుదాల్చారు‘ అని వివరించారు. 

యువతా! కలసి నడుద్దాం...! 
జీ20 సదస్సు ఘన విజయానికి యువత భాగస్వామ్యం ప్రధాన కారణమని మోదీ అన్నారు. లోకల్‌ నినాదానికి ఊపు తెచ్చేందుకు కాలేజీ, వర్సిటీ క్యాంపస్‌ లు కేంద్రాలుగా మారాలని ఆశాభావం వెలిబుచ్చారు. ‘ఖాదీ దుస్తులు ధరించడం ద్వారా వాటికి ప్రాచుర్యం కల్పించండి. క్యాంపస్‌లలో ఖాదీ ఫ్యాషన్‌ షోలు పెట్టండి’ అని యువతను కోరారు. ‘మన స్వాతంత్య్ర యోధుల్లా దేశం కోసం మరణించే అదృష్టం మనకు లేదు. కనీసం దేశం కోసం జీవితాలను అంకితం చేసే సదవకాశం మాత్రం మనందరికీ ఉంది’ అని గుర్తు చేశారు. వందేళ్ల క్రితం యువత స్వరాజ్య భారతం కోసం కదం తొక్కింది. మనమిప్పుడు సమృద్ద భారతం కోసం పాటుపడదాం. రండి, కలసి నడుద్దాం!‘ అని పిలుపునిచ్చారు.   

మరిన్ని వార్తలు