‘నన్ను చూసి నవ్వుతావంట్రా.. ఎంత ధైర్యంరా నీకు’

24 Dec, 2020 09:53 IST|Sakshi
చికిత్స పొందుతున్న జాలాది శివాజి 

నవ్వినందుకు యువకుడిపై కత్తితో దాడి

సాక్షి, పిట్టలవానిపాలెం(గుంటూరు): ‘నన్ను చూసి నవ్వుతావంట్రాఎంత ధైర్యంరా నీకు’ అంటూ ఓ యువకుడు మరో యువకుడిని కత్తితో గొంతు కోసిన ఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం శివారు మండే వారిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి సెమీ క్రిస్మస్‌ వేడుకలను నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామంలో యువకులు అందరూ కలిసి ప్రత్యేక దృశ్య రూపకం వద్ద ఉన్నారు. గ్రామానికి చెందిన  జాలాది శివ (20) యువకుడు సమీపంలో మరో వ్యక్తితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. వారికి ఎదురుగా ఉన్న దోనెపాటి శోభన్‌ నన్ను చూసి నవ్వుతావంట్రా నీకు ఎంత ధైర్యం అంటూ అతనిపై కలబడ్డాడు. సమీపంలో ఉన్నవారు ఇద్దరికీ సర్దిచెప్పి పంపించారు. అయితే శివాజీ ఇంటికి వెళ్లిపోయాడు. అతనితో పాటే శోభన్‌ కూడా ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని శివాజీని కడుపులో పొడిచేందుకు ప్రయత్నించగా దగ్గరలో ఉన్నవారు అతన్ని పక్కకు లాగడంతో చేతిపై కత్తిగాయం అయింది. (చదవండి: ప్రియుడి మోసం.. నర్సు ఆత్మహత్య)

సమీపంలోని వారు గాయం అయిన చోట పసుపు రాస్తుండగా మరోసారి కత్తితో వచ్చి ఒక్కసారిగా గొంతుకోసి వెళ్లిపోయాడు. రక్తస్రావం అధికం కావడంతో స్థానిక యువకులు శివాజీని చందోలు పోలీసు సేష్టన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం పొన్నూరు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. జాలాది శివాజీ 10 ఏళ్ల వయస్సులో తండ్రిని, 15 ఏళ్ల వయస్సులో తల్లిని కోల్పోయాడు. అప్పటి నుంచి గ్రామస్తులు, బం«ధువులతో సన్నిహితంగా ఉంటూ ఆటోను అద్దెకు తీసుకుని బాడుగలు లేని సమయంలో కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. దిక్కూ మొక్కూలేని వాడని ఈ విధంగా చేస్తారా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై శివాజీ ఆరోగ్యంగా తిరిగి రావాలని గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు.

మరిన్ని వార్తలు