ఈదురు గాలులతో ముంచుకొస్తున్న మాండూస్‌.. ఏపీలో ఆరు జిల్లాలపై ఎఫెక్ట్‌!

10 Dec, 2022 01:57 IST|Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ఒంగోలు అర్బన్‌/తిరుపతి అర్బన్‌/సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్‌ తుపాను కలవరపెడుతోంది. శుక్రవారం తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినా, దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. తమిళనాడు రాష్ట్రంపై ఎక్కువగా ఉంది. 14 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి తమిళనాడులోని మహాబలిపురానికి 80 కిలోమీటర్లు, చెన్నైకి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం వద్ద శనివారం ఉదయం లోపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రత్యేక బులెటిన్‌లో తెలిపింది. తీరం దాటిన తర్వాత శనివారం మధ్యాహ్నానికి క్రమంగా వాయుగుండంగా మారి బలహీనపడుతుందని వెల్లడించింది. తుపాను ప్రభావం తమిళనాడులోని 15 జిల్లాలపై పడింది. భారీ వర్షం కారణంగా చెన్నై నుంచి 21 విమాన సేవలను రద్దు చేశారు. 

6 జిల్లాలపై ప్రభావం.. అప్రమత్తమైన ప్రభుత్వం  
ఈ తుపాను ఆంధ్రాలోని ఆరు జిల్లాలపై ప్రభావం చూçపనుంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే పరిస్థితి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. సీఎం వైఎస్‌ జగన్‌ రెండు సార్లు తుపాను ముందు జాగ్రత్త చర్యలపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని స్టేట్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి ఎప్పటికప్పుడు తుపాను కదలికలను రెవెన్యూ, విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సమీక్షిస్తున్నారు. ఆరు జిల్లాల్లోని 210 మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం మొత్తం 5 ఎన్డీఆర్‌ఎఫ్, 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 3, తిరుపతి జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 2  బృందాలను ఉంచామన్నారు. 

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో తీరం వెంబడి 150 మీటర్ల మేరకు సముద్రం చొచ్చుకువచ్చింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో 10.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లో  ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఈ ఆరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

నెల్లూరు జిల్లాలో టోల్‌ఫ్రీ నంబర్‌ 1077 
నెల్లూరు జిల్లాలో తుపానుపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ప్రజలకు సహాయం చేయడానికి జిల్లా కేంద్రంలోని కంట్రోల్‌ రూంలో టోల్‌ ప్రీ నంబరు 1077  ఏర్పాటు చేశారు.  

విద్యుత్‌ స్తంభాలు కూలినా, లైన్లు తెగినా.. టోల్‌ ఫ్రీ నంబరు 1912కు సమాచారం ఇవ్వాలి 
తుపాను నేపథ్యంలో అధికారులు, సిబ్బంది  అప్రమత్తంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీలు ఆదేశాలు జారీచేశారు. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. చీఫ్‌ జనరల్‌ మేనేజర్లను నోడల్‌ ఆఫీసర్లుగా నియమించారు. విద్యుత్‌ అంతరాయాలను పర్యవేక్షించేందుకు డివిజన్లు, సర్కిళ్ల స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేశారు. అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశారు. 24 గంటలూ అందుబాటులో ఉండాలని సూచించారు. దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు, లైన్లను వెంటనే పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడం, లైన్లు తెగిపోవడం లాంటి జరిగితే సమీపంలోని విద్యుత్‌ శాఖ సిబ్బందికి లేదా టోల్‌ ఫ్రీ నంబరు 1912కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

మరిన్ని వార్తలు