నిబంధనలు తెలియవా?.. మళ్లీ ఎందుకంటున్న ఇళయరాజా..!

24 Nov, 2023 12:25 IST|Sakshi

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా, దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు, సంగీత దర్శకుడు దీనా మధ్య కోల్డ్‌ వార్‌ జరుగుతోందా? అంటే ఈ ప్రశ్నకు కోలీవుడ్‌లో అవుననే సమాధానమే వినిపిస్తోంది.  సంగీత రంగంలో అపర చాణుక్యులుగా ముద్ర వేసుకున్న ఇళయరాజాను వ్యతిరేకించి ఇక్కడ మనుగడ సాగించటం సాధ్యమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఆయన్ని ఎదుర్కోవడానికే మరో సంగీత దర్శకుడు దీనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘానికి రెండుసార్లు అధ్యక్షుడిగా ఎంపికయ్యా రు. కాగా ఈ సంఘానికి ప్రస్తు త కార్యవర్గ పదవీ బాధ్యతలు ముగియనున్నాయి. దీంతో ఈ సంఘానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. 

అయితే సంగీత దర్శకుడు దీనా మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంలోనే ఇళయరాజాకు, ఆయనకు మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తున్నట్లు లేటెస్ట్ టాక్.  ప్రస్తుత దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు దీనాతో ఇళయరాజా మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

అందులో సినీ రంగంలో మొట్టమొదటిసారిగా సంగీత కళాకారుల సంఘం ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ సంఘాన్ని ప్రారంభించింది ఎంపీ శ్రీనివాసన్‌ అని తెలిపారు. సంఘానికి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే సంఘానికి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాలనే నిబంధన కూడా ఉందన్నారు.

అందువల్ల నువ్వు ఇప్పటికే రెండుసార్లు సంఘం అధ్యక్షత బాధ్యతలను నిర్వహించావని.. మూడోసారి ఎందుకు పోటీ చేస్తున్నావని ఇళయ రాజా ప్రశ్నించారు. ఈసారి కొత్త తరానికి అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. ఈ సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయన్నారు. అయితే తాను ఆ విషయం గురించి లోతుగా పోదలచుకోలేదని.. సంఘం సభ్యులు కోరిక మేరకే అధ్యక్షుడిగా అంగీకరించాలని అంటున్నారు. అయితే దీన్ని ఇళయరాజా వ్యతిరేకించారు. దీనిపై స్పందించిన దీనా కాలానుగుణంగా సంఘం నిబంధనలు మారుతాయని అన్నారు. ఇళయరాజా అన్నయ్యను ఎవరో తప్పు దోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను ఇళయరాజాను కలిసి వాస్తవ పరిస్థితులు వివరిస్తానని దీనా స్పష్టం చేశారు. 
 

మరిన్ని వార్తలు