ఇల్లు కొనుక్కున్నా.. పట్టా వెనక్కి తీసుకోండి

5 Jun, 2023 13:24 IST|Sakshi

మంగళగిరి: రాష్ట్రంలో ఇల్లులేని పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం పట్టాలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా యర్రబాలెంకు చెందిన దండిభొట్ల నాగసీత కనకదుర్గను అధికారులు అర్హురాలిగా గుర్తించి ఇటీవల ఆమెకు పట్టాను అంద­జేశారు. నిజానికి.. 2019లో తనకు సొంతిల్లు లేకపోవడంతో కనకదుర్గ అందుకోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తాజాగా అర్హురాలిగా గుర్తించింది.

కానీ, 2019 అనంతరం తన భర్త దండిభొట్ల సుబ్రహ్మణ్య శర్మ పేరుతో వున్న వంద చదరపు గజాల స్థలాన్ని విక్రయించి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఈ ఏడాది మార్చి 23న రిజిస్ట్రేషన్‌ చేయించుకుని అందులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. అప్పటికే ఇంటి స్థలానికి అర్హురాలిగా కనకదుర్గను ఎంపిక చేసిన అధికారులు ఆమె పేరున పట్టాను మంజూరుచేసి ఇటీవల అందరితో పాటు అందజేశారు.

కానీ, తనకు సొంతిల్లు ఉండగా పేదలకు చెందాల్సిన సెంటు స్థలాన్ని తాను పొందకూడదని కనకదుర్గ గ్రహించి ప్రభుత్వం తనకు కేటాయించిన  ఇంటి స్థలాన్ని రద్దుచేసి వేరొక అర్హురాలికి ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులకు ఆదివారం ఆమె లేఖ రాశారు. 

మరిన్ని వార్తలు