విశాఖపట్నం: మావోయిస్టు అరెస్టు!

9 Jan, 2022 11:11 IST|Sakshi

పెదబయలు ఏసీఎం కొర్రా సింగ్రును పట్టుకున్న కూంబింగ్‌ పోలీసులు

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు(ఏసీఎం) కొర్రా సింగ్రు అలియాస్‌ సుందరరావును శనివారం కూంబింగ్‌ పోలీసులు అరెస్టు చేశారు.  నాలుగు హత్యలు, రెండు మందుపాతరలు పేల్చిన ఘటనలు, రెండు కిడ్నాప్‌లు, ఐదు ఎదురుకాల్పుల ఘటనల్లో సుందరరావు నిందితుడని పోలీసులు తెలిపారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా కొండసువ్వాపల్లి గ్రామానికి చెందిన కొర్రా సింగ్రు రెండువేల సంవత్సరంలో రైతు కూలి సంఘంలో మావోయిస్టు పార్టీ సభ్యుడిగా చేరాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు మావోయిస్టు పార్టీలో మిలీషియా, దళ సభ్యుడిగా, పార్టీ మెంబర్‌గా, ప్రస్తుతం పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. విశాఖ జిల్లాలో గాలికొండ, కోరుకొండ, పెదబయలు, కటాఫ్‌ ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో తిరుగుతూ పలునేరాల్లో పాల్గొన్నాడు. కొర్రాసింగ్రుపై ఏపీలో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఒడిశాలోను సుమారు 70కు పైగా కేసులు నమోదయ్యాయి.   

పోలీసులకు పట్టుబడిందిలా.. 
కూంబింగ్‌ చేస్తున్న పోలీసు పార్టీలపై మందుపాతరను పేల్చి హతమార్చాలన్న లక్ష్యంతో కొర్రా సింగ్రు అలియాస్‌ సుందరరావు, మరికొంతమంది మావోయిస్టు మిలీషియా సభ్యులతో కలిసి కోరుకొండ ప్రాంతం నుంచి గాలికొండ ప్రాంతానికి మందుపాతరలు తీసుకువెళ్తూ పట్టుబడ్డాడు. సప్పర్ల జంక్షన్‌ వద్ద సంచితో ఉన్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతనితో వచ్చిన మిలీషియా సభ్యులు తప్పించుకున్నారు. అతని వద్ద సంచిలో కంట్రీమేడ్‌ పిస్టల్‌ ఒకటి, 7.65 ఎంఎం లైవ్‌రౌండ్స్‌ ఐదు, రెండు కిలోల లైవ్‌ మైన్‌తో ఉన్న స్టీల్‌ క్యారేజ్‌ ఒకటి, డిటోనేటర్లు రెండు, 60 మీటర్ల ఎలక్ట్రికల్‌ వైర్, 4 నిప్పో బ్యాటరీలు ఉన్నట్టు ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తెలిపారు.  

నాలుగు హత్య కేసుల్లో.. 
►డిసెంబర్‌ 23, 2020న పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ చింతగరువు గ్రామానికి చెందిన చిక్కుడు సత్యారావు అలియాస్‌ సతీష్‌ను పోలీసు ఇన్‌ఫార్మర్‌గా ముద్రవేసి హత్యకు పాల్పడ్డాడు. 
►అక్టోబర్‌ 20, 2019న పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ లండులు గ్రామానికి చెందిన కొర్రా రంగారావును చిట్రకాయల పుట్రువద్ద పోలీసు ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో అత్యంత కిరాతకంగా చంపేశాడు. 
►జూన్‌ 28, 2019న పెదబయలు మండలం, బొంగజంగి గ్రామానికి చెందిన కొర్రా సత్తిబాబును అర్ధరాత్రి ఇంటికి వెళ్లి చంపాడు.
►డిసెంబర్‌ 9, 2017న జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయితీ మద్దిగరువు గ్రామానికి చెందిన కొలకాని సూర్యచంద్రబాబు, ముక్కాల కిషోర్‌లను మద్దిగరువు గ్రామ శివారులో హతమార్చాడు.     

చదవండి: మరణ మృదంగం! ఒక్కరోజులోనే 15 మంది మృతి.. కారణాలేవేర్వేరు!

మరిన్ని వార్తలు