పరీక్ష ఫలితాల వెల్లడిలో జేఎన్‌టీయూ(ఏ) కొత్త ఒరవడి 

9 Jan, 2022 11:21 IST|Sakshi

వర్సిటీ జారీ చేసే మార్క్స్‌ మెమోను డిజీ లాకర్‌లో

డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు 

వర్సిటీ పరిధిలోని దాదాపు లక్ష మంది విద్యార్థులకు ఉపయోగం 

సర్టిఫికెట్ల కోసం ప్రతిసారి కళాశాలలకు వెళ్లవలసిన అవసరం 

ఉండదంటున్న వర్సిటీ వర్గాలు 

తెలుగు రాష్ట్రాల్లో డిజీ లాకర్‌ను అమలు చేస్తోన్న తొలి వర్సిటీగా జేఎన్‌టీయూ (ఏ) రికార్డు 

అనంతపురం: డిజీ లాకర్‌ను జేఎన్‌టీయూ(ఏ) వినూత్న రీతిలో ఉపయోగిస్తోంది. వర్సిటీ జారీ చేసే ప్రతి సర్టిఫికెట్‌ను డిజీ లాకర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే సౌలభ్యాన్ని విద్యార్థులకు కల్పించింది. జేఎన్‌టీయూ(ఏ) అధికారులు పరీక్ష ఫలితాలు ప్రకటించిన తక్షణమే డిజీ లాకర్‌లోకి సర్టిఫికెట్‌లు వచ్చేలా ఏర్పాట్లు చేసింది. విద్యార్థి నేరుగా డిజీ లాకర్‌లో తమ సర్టిఫికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది.

దీంతో విద్యార్థులు ఎక్కడైనా, ఎప్పుడైనా తమ సర్టిఫికెట్‌లను కళాశాలకు వెళ్లకుండానే పరిశీలించుకోవచ్చు. జేఎన్‌టీయూ (ఏ) పరిధిలోని వైఎస్సార్‌ కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 110 ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌ విద్యార్థులు లక్ష మందికి ఇది ఉపయోగకరంగా మారనుంది. తెలుగు రాష్ట్రాల్లో డిజీ లాకర్‌ను అమలు చేస్తోన్న తొలి వర్సిటీగా జేఎన్‌టీయూ (ఏ) నిలిచింది. నవంబర్‌ 1, 2021 నుంచి ఈ విధానాన్ని వర్సిటీ ప్రవేశపెట్టింది.

లాగిన్‌ కావడం ఎలా? 
డిజిటల్‌ లాకర్‌లో ఖాతా తెరవడం చాలా సులువు. ఇది పూర్తిగా ఉచితం కూడా. ఆధార్‌కార్డు నంబర్‌తో ఎన్‌రోల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం ఎన్‌రోల్‌ అయిన తరువాత అందులో ఎన్ని డాక్యుమెంట్లు అయినా భద్రపరచుకోవచ్చు. అవసరమైనప్పుడు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే ఈ విధానంపై సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది సద్వినియోగం చేసుకోవడంలేదు. కేవలం మెయిల్‌ ఐడీ క్రియేట్‌ చేసుకున్న తరహాలోనే డిజీ లాకర్‌లో ఐడీ, పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకుంటే చాలు ఎన్ని డాక్యుమెంట్లు అయినా భద్రపరచుకోవచ్చు.

ఏమిటీ డిజీ లాకర్‌? 
డిజీ లాకర్‌ అంటే డిజిటల్‌ లాకర్‌. ఒకసారి ఇందులో లాగిన్‌ అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఏ రకమైన డాక్యుమెంట్‌ అయినా ఇందులో పొందుపరచుకోవచ్చు. డిజీ లాకర్‌ను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తే ప్రభుత్వం జారీ చేసే అన్ని రకాల డాక్యుమెంట్‌లను ఇందులో భద్రపరచుకోవచ్చు.

ప్రభుత్వ సంస్థలకు జారీ చేసే డాక్యుమెంట్లు నేరుగా డిజీ లాకర్‌లోకి వచ్చేస్తాయి. ఆటోమేటిక్‌గా డిజీ లాకర్‌లోకి వచ్చే డాక్యుమెంట్లు, డేటాతో పాటు మనం అదనంగా డేటా, డాక్యుమెంట్లను కూడా భద్రపరచుకోవచ్చు. ఎప్పుడైనా ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ పోగొట్టుకున్నట్లయితే వెంటనే డిజీ లాకర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

వర్సిటీకి తిరిగే పని ఉండదు
ఇంతకాలం ఏదైనా సర్టిఫికెట్‌ కావాలంటే విద్యార్థి నేరుగా వర్సిటీకి రావాల్సి వచ్చేది. ఇప్పుడు డిజిటలైజేషన్‌ విధానంతో సర్టిఫికెట్లు అన్నీ అప్‌లోడ్‌ చేసే విధానాన్ని ప్రవేశపెట్టాం. దీంతో విద్యార్థి ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే నేరుగా సరి్టఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా డిజీ లాకర్‌ విధానానికి అనుసంధానం చేశాం.
 – ప్రొఫెసర్‌ జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్‌టీయూ(ఏ)

సర్టిఫికెట్లకు భద్రత 
విద్యార్థికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని గోప్యంగా డిజీ లాకర్‌లో దాచుకోవచ్చు. సరి్టఫికెట్లే కాకుండా విలువైన సమాచారాన్ని భద్రపరచుకోవచ్చు. విద్యార్థి శ్రేయస్సు దృష్ట్యా సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. – ప్రొఫెసర్‌ శశిధర్, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూ(ఏ) 

మార్కుల జాబితాలన్నీ డిజీ లాకర్‌లోకి
బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఆయా సెమిస్టర్‌ ఫలితాలు విడుదలైన తక్షణమే మార్క్స్‌కార్డులు డిజీ లాకర్‌లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థి నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కేవలం ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ కోసమే కళాశాలకు వెళ్లాల్సి ఉంటుంది. జేఎన్‌టీయూ (ఏ) డిజీ లాకర్‌ విధానంలోకి లాగిన్‌ అయ్యింది.  –ప్రొఫెసర్‌ కేశవ రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌

>
మరిన్ని వార్తలు