అనుమతి లేకుండానే విదేశాలకు మార్గదర్శి ఎండీ..  

2 Jun, 2023 08:09 IST|Sakshi

శైలజా కిరణ్‌ రాకను మేం అడ్డుకోవడంలేదు

తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం వాదనలు

అసలు లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేయలేదన్న కేంద్ర ప్రభుత్వం

ఎల్‌వోసీని ఉపసంహరించాలంటూ శైలజా కిరణ్‌ పిటిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎంసీఎఫ్‌పీఎల్‌)లో వందల కోట్ల రూపాయల చందాదారుల సొమ్మును ఇతర మార్గాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెరుకూరి శైలజా కిరణ్‌ ఎలాంటి అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లారని తెలంగా­ణ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం వివరించింది. ఆమె తిరిగి రావడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పడంలేదని తెలిపింది. 

తనపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేశారని, దాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రాన్ని, ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ శైలజా కిరణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కాజా శరత్‌ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీపీ లలితా గాయత్రి వాదనలు వినిపిస్తూ.. వందల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి అక్రమ మార్గాలకు మళ్లించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లారన్నారు.

 విచారణకు హాజరు కావాలని అంతకు ముందు మూడుసార్లు ఆమెకు సీఐడీ నోటీసులు జారీ చేసినా.. హాజరుకాలేదని వెల్లడించారు. ఏపీలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి అక్కడి హైకోర్టును ఆశ్రయించాలని, ఈ పిటిషన్‌పై విచారణ పరిధి తెలంగాణ హైకోర్టుకు లేదని చెప్పారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని, ఆదేశాలు వచ్చే వరకు విచారణను వాయిదా వేయాలని కోరారు. శైలజపై ఎల్‌ఓసీ జారీ చేయలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అనురాగ్‌ చెప్పా­రు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పు వెల్లడిస్తానని పేర్కొన్నారు. కాగా,  లుక్‌ అవుట్‌ సర్క్యులరే జారీ చేయనప్పుడు పిటిషన్‌ ఎందుకు వేయాల్సి వచ్చిందన్నది చర్చనీయాంశం అయ్యింది. 

ఇది కూడా చదవండి: వైద్య విద్యలో నూతన అధ్యాయం.. ఏపీ చరిత్రలోనే రికార్డు.. 

మరిన్ని వార్తలు