ఆంధ్రప్రదేశ్‌లో నిలకడగా ‘కరోనా’

2 Aug, 2021 03:22 IST|Sakshi

సమూహాలుగా చేరితే ప్రమాదమంటున్న నిపుణులు 

జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వం సూచన

మాస్క్, భౌతికదూరం, చేతుల శుభ్రత తప్పనిసరి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్‌ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గణాంకాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కేరళలో ఇప్పటికే థర్డ్‌వేవ్‌ మొదలైనట్టు సంకేతాలొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా అదుపులోనే ఉన్నట్టు కేసుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనం సమూహాలుగా చేరుతుండటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం అనే మూడు అంశాలపైనే కరోనా నియంత్రణ ఆధారపడి ఉంటుందంటున్నారు.

ఓ వైపు కరోనా నియంత్రణకు ప్రభుత్వం శరవేగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టింది. రిస్కు గ్రూపులుగా చెప్పుకునే ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు, 45 ఏళ్ల వయసు దాటిన వారు, గర్భిణులకు టీకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు కోట్ల డోసులు వేసిన 10 రాష్ట్రాల్లో ఏపీ చేరింది. ఈ పరిస్థితుల్లో థర్డ్‌ వేవ్‌ను నిలువరించేందుకు జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మాస్కుల్లేకుండా బయటకొస్తే రూ.100 జరిమానా, మాస్కుల్లేని వారిని లోపలకు అనుమతించే వాణిజ్య, వ్యాపార సముదాయాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ జరిమానా విధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు.

మరిన్ని వార్తలు