దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం నిర్లక్ష్యం

8 Feb, 2021 11:20 IST|Sakshi

మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, విశాఖపట్నం: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రజలంటే ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమేనని బీజేపీ అనుకుంటుందని ఆయన దుయ్యబట్టారు. బడ్జెట్‌లో కడప స్టీల్‌ ప్లాంట్‌కు నిధులు కేటాయించలేదని.. ఏపీకి మొండిచేయి చూపించిందని ధ్వజమెత్తారు.

విభజన హామీలు అమలు చేయలేదు సరి కదా ఎందరికో ఉపాధి కల్పిస్తున్న  స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన నేతలు ప్రజల ఆకాంక్షను గుర్తు చేసుకోవాలన్నారు. ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖ.. ప్రజల అభిప్రాయం చెప్పినట్టేనన్నారు. పవన్‌కల్యాణ్‌, బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. విశాఖ ఉక్కు కోసం రాజకీయాలకు అతీతంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ ఎంపీల అవసరం లేదని కేంద్రం భావిస్తే పతనం తప్పదని హెచ్చరించారు. తెలుగు ప్రజలకు నష్టం కలిగించిన పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయని అవంతి శ్రీనివాస్‌ అన్నారు.
(చదవండి: మోగని ‘గంట’: ఉత్తుత్తి లేఖతో హడావుడి..)
(చదవండి: బాబ్బాబూ.. పోటీలో ఉండండి చాలు..)

మరిన్ని వార్తలు