నిర్మలా సీతారామన్‌ ప్రకటనపై మండిపడ్డ మంత్రి బొత్స

8 Mar, 2021 21:45 IST|Sakshi

సాక్షి, విశాఖ: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దాని ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తామని ఆయన హామీనిచ్చారు. సోమవారం పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ అంశంపై గతంలో కేంద్రమంత్రులను కూడా కలిశామని వివరించారు. స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ కేంద్రానికి రాసిన లేఖకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు. స్టీల్ ప్లాంట్‌పై తమ వైఖరి మారదని స్పష్టం చేశారు. 

టీడీపీ హయాంలోనే స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అంకురార్పణ జరిగిందని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను మూసేసిన ఘనత చంద్రబాబుదేదని విమర్శించారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఒక వర్గం మీడియా ప్రయత్నిస్తుందని, రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదని కేంద్రమే స్పష్టం చేసినా వారి దుశ్ప్రచారం ఆగడం లేదని ధ్వజమెత్తారు. సీఎం జగన్ పాలనలో స్టీల్ ప్లాంట్ విషయంలో అన్యాయం జరగదని హామినిచ్చారు.స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునే వరకు నిరంతర పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. నీతి, న్యాయానికి కట్టుబడ్డ సీఎం జగన్ వెనుకే రాష్ట్ర ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ఎవరెన్ని అవాక్కులు, చవాక్కులు పేలినా ప్రజల మద్దతు సీఎం జగన్‌కే ఉందని వెల్లడించారు. 

స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన..
విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కూర్మన్నపాలెం మెయిన్‌గేట్ వద్ద రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన స్వరాలు వినిపించాయి.

మరిన్ని వార్తలు