వ్యవసాయ ఉత్పత్తులకు ముందే మద్ధతు ధరలు : మంత్రి కాకాణి

26 Sep, 2023 13:08 IST|Sakshi

రైతుకు మద్ధతు, పంటకు గిట్టుబాటు ధర

మంత్రి కాకాణి గోవర్ధన్‌

సాక్షి, అమ‌రావ‌తి: ఆంధ్రప్ర‌దేల్ వ్య‌వ‌సాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధత్తు ధరలు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ హామీకి అనుగుణంగా.. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో 2023-24 ఏడాదికి వివిధ వ్యవసాయ ఉత్పత్తుల మద్ధత్తు ధరలకు సంబంధించిన‌ గోడ‌పత్రికను రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి ఆవిష్కరించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 

ఇక రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించదేమోనన్న బెంగ లేని విధంగా ఈ మద్ధత్తు ధరలను ప్రకటించామ‌ని తెలిపారు. వరి, పసుపు, మిర్చి, ఉల్లి, చిరు ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశెనగ, కొబ్బరి, ప‌త్తి, బత్తాయి, అరటి, సోయాబీన్స్, ప్రొద్దుతిరుగుడు వంటి 22 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు క్వింటాల్ ధరను ప్రకటించారు. రైతుల్లో మద్ధత్తు ధరలపై పూర్తి అవగాహన కలిగించేందుకు రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఈ ధరల గోడ‌పత్రికను ప్రదర్శిస్తార‌ని తెలిపారు. రైతుకు మ‌ధ్య‌ దళారుల బెడద, రవాణా ఖర్చు లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే సీయం యాప్(Continuous Monitoring of Agriculture Prices and Procurement)ద్వారా కొనుగోలు చేయ‌వచ్చ‌న్నారు.

మ‌ద్ద‌త్తు ధ‌ర‌ల‌పై వివ‌ర‌ణ ఇలా..

రాష్ట్రంలోని రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించాలని తొలిసారిగా 3 వేల కోట్ల రూపాయ‌లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి నిరంతరం మానిటర్ చేస్తూ రైతులకు మద్ధత్తు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. అందుకే ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని కొనుగోలు కేంద్రంగా ప్రకటించామని తెలిపారు. ధాన్యాన్ని కల్లం దగ్గరే కొనుగోలు చేయడంతో పాటు కొనుగోలు చేసిన 15 రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో చిన్నసన్నకారు రైతులకు ప్రాధాన్యతను ఇస్తున్నామని వివరించారు. 

మార్కెట్లో ఆన్లైన్ యాప్ ద్వారా అభివృద్ధి చెంద‌డం..

మార్కెట్లో పోటీ తత్వం పెరగాలని తద్వారా రైతన్నకు మెరుగైన ధర రావాలని అందుకోసం అవసరమైతే ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి పోటీని పెంచుతుందని మంత్రి స్పష్టం చేశారు.
మద్ధత్తు ధరలకు పంటలు అమ్ముకోవాలంటే రైతులు తప్పని సరిగా ఈ-క్రాపులో వారి పంటల వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి విజ్ణప్తి చేశారు. 

అలా నమోదు చేసుకున్న తర్వాత రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ధ సీఎం యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనీస గిట్టుబాటు ధర దక్కని పరిస్థితిలో వెంటనే కొనుగోలు చేస్తామని తెలిపారు. అదే విధంగా రైతులు రైతు భరోసా కేంద్రాలకు తీసుకువచ్చే పంటలకు కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడాలని మంత్రి రైతులకు మనవి చేశారు. రైతులు వారి పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాక గూగల్ ప్లేస్టోర్ నుంచి CM APP-Farmer Payment Status App ను డౌన్ లోడ్ చేసుకుని తమ చెల్లింపు స్థితిగతులను ఎప్పటికప్పుడు తెల్సుకోగలరని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆశాఖ కమీషనర్, మార్క్ ఫెడ్ ఎండి రాహల్ పాండే, ఆశాఖ ఆర్జెడి శ్రీనివాసరావు తదితర అధికారుల పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు