సీఎం జగన్‌ దళితుల పక్షపాతి: విశ్వరూప్‌

24 Jul, 2020 17:41 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: రాజమండ్రిలో దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించారని మంత్రి పినిపే విశ్వరూప్తెలిపారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకున్నారని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌‌ మాట్లాడుతూ.. ‘సీఎం జగన్‌ దళితుల పక్షపాతి. తప్పు చేస్తే ఎవరిని క్షమించరు. మాజీ ఎంపీ హర్షకుమార్ సంస్కారహీనంగా మాట్లాడారు. ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. బహిరంగంగా చంద్రబాబు కాళ్ళు పట్టుకున్న వ్యక్తి హర్షకుమార్. ఎంపీ సీటు కోసం దళితుల ఆత్మగౌరవాన్ని ఆయన చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారు. ఇద్దరు దళితులకు చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తే.. సీఎం జగన్ ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చారు. ఐదుగురికి కీలకమైన బాధ్యతలు కట్టబెట్టారు. ఒక ఎస్టీని డీజీపీగా, ఒక దళితుడిని ఎన్నికల కమిషనర్‌గా చేసిన వ్యక్తి సీఎం జగన్’ అని స్పష్టం చేశారు. (‘హర్షకుమార్‌.. నాలుక అదుపులో పెట్టుకో’)

విశ్వరూప్‌ మాట్లాడుతూ.. ‘దళితులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో హర్షకుమార్ పోటీ చేస్తే 9000 వేల ఓట్లు, ఆయన కుమారుడు పోటీ చేస్తే 600 ఓట్లు వచ్చాయి. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు విమర్శించారు. దళితులు శుభ్రంగా ఉండరన్న ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. చంద్రబాబు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని మోసం చేశారు. చంద్రబాబు ఊరు చివర అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చూస్తే సీఎం జగన్ విజయవాడ నడిబొడ్డున పెట్టాలని చూశారు. పేదలకు ఇంగ్లీషు మీడియంను అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. దళితులకు ఇచ్చే ఇళ్ల స్థలాలను చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. దళితులకు ఐదేళ్లలో టీడీపీ చేసిన ఖర్చుపైన.. ఏడాదిలో వైస్సార్సీపీ ప్రభుత్వం చేసిన ఖర్చుపైన బహిరంగ చర్చకు మేము సిద్ధం. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దళితులకు రూ.11, 205 వేల కోట్లు ఖర్చు చేశారు’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు