‘కేంద్రం’ వాటాకు ‘కత్తెర’

13 Feb, 2022 04:29 IST|Sakshi

కొత్త జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు 90 శాతం కాదు 60 శాతమే

కేంద్ర జల్‌ శక్తి శాఖ మార్గదర్శకాలు

గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరితో పాటు ఇతర ప్రాజెక్టులకు అదే రీతిలో నిధులు

ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, లఢక్‌లకు మినహాయింపు

పోలవరంతో సహా 16 జాతీయ ప్రాజెక్టులకు పాత విధానం 

సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా జాతీయ హోదా పొందిన సాగు నీటి ప్రాజెక్టుల ఖర్చులో కేంద్రం ఇచ్చే నిధులకు కత్తెర వేసింది. కొత్త జాతీయ ప్రాజెక్టులకు 60 శాతం మాత్రమే కేంద్రం ఇవ్వనుంది. మిగతా 40 శాతం ఆయా రాష్ట్రాలే భరించాలి. దేశ విస్తృత ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు వాటికి జాతీయ హోదా కల్పించి, అంచనా వ్యయంలో 90 శాతం నిధులను ఇప్పటివరకూ కేంద్రం భరిస్తోంది. ఇప్పుడా నిధుల్లో కోత పెట్టింది. ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. నదుల అనుసంధానం కింద చేపట్టే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరితో పాటు ఇతర  ప్రాజెక్టులకూ ఇదే రీతిలో నిధులివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, రెండు హిమాలయ రాష్ట్రాలు (హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌), కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ–కశ్మీర్, లడఖ్‌లకు పాత విధానంలోనే 90 శాతం ఇవ్వనుంది. ఇంతకు ముందే ఆమోదం పొందిన పోలవరంతోపాటు 15 జాతీయ ప్రాజెక్టులకు ప్రస్తుత పద్ధతి ప్రకారమే 90 శాతం నిధులిస్తామని కేంద్ర జల్‌ శక్తి శాఖ తెలిపింది.

జాతీయ హోదా కల్పన, నిధులు మరింత క్లిష్టం
► తాజా మార్గదర్శకాల ప్రకారం.. నిర్మాణ వ్యయం, పునరావాసం, విద్యుదుత్పత్తి వ్యయం తదితర సమస్యల వల్ల నిధుల కొరతతో నిర్మాణం పూర్తి కాని అంతర్రాష్ట్ర సాగు నీటి ప్రాజెక్టులకు కొత్తగా జాతీయ హోదా కల్పించి, సత్వరమే పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. నీటి లభ్యత, పంపిణీ సమస్య లేకుండా ఒక రాష్ట్రంలో రెండు లక్షల హెక్టార్లు అంతకంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించనుంది.
► ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఆ సమయంలో నిధుల లభ్యత, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి మాత్రమే జాతీయ హోదా కల్పిస్తారు.
► రాష్ట్రం తన వాటా నిధులను జమ చేసి.. 75 శాతం ఖర్చు చేయకపోతే కేంద్రం తన వాటా నిధులను విడుదల చేయదు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగితే.. ఆమోదం పొందిన పెరిగిన వ్యయంలో 20 శాతమే కేంద్రం భరిస్తుంది. మిగతా నిధులను ఆయా రాష్ట్రాలే భరించాలి. 
► పాత విధానంలో కెన్‌–బెట్వా లింక్‌ ప్రాజెక్టే జాతీయ హోదా కింద కేంద్రం నిధులిచ్చే చివరి ప్రాజెక్టు.

ఏఐబీపీ నిధుల మంజూరులోనూ కోత
నిధుల కొరత వల్ల సకాలంలో పూర్తి కాని దేశంలోని 99 ప్రాజెక్టులకు సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద కేంద్రం నిధులిస్తోంది. కొత్తగా ఏఐబీపీ కింద ఎంపిక చేసే ప్రాజెక్టులకూ నిధుల మంజూరులో కోతలు పెడుతూ కేంద్ర జల్‌ శక్తి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం..
► ఎనిమిది ఈశాన్య, రెండు హిమాలయ రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, లఢఖ్‌లలో ఏఐబీపీ కింద కొత్త ఎంపిక చేసే ప్రాజెక్టులకు వాటి అంచనా వ్యయంలో 90 శాతం నిధులను కేంద్రం ఇస్తుంది.
► కరవు నివారణ పథకం (డీపీఏపీ), ఎడారి నివారణ పథకం(డీడీపీ) అమలవుతున్న ప్రాంతాలు, గిరిజన, వరద ప్రభావిత, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, బుందేల్‌ఖండ్, విదర్భ, మరఠ్వాడ, కేబీకే (ఒడిశా) ప్రాంతాల్లో కొత్తగా ఎంపిక చేసే ఏఐబీపీ ప్రాజెక్టులకు అంచనా వ్యయంలో 60 శాతం ఇవ్వనుంది. మిగతా ప్రాంతాల్లో ఏఐబీపీ కింద ఎంపిక చేసే ప్రాజెక్టులకు అంచనా వ్యయంలో 25 శాతం నిధులిస్తుంది. మిగతా వ్యయాన్ని ఆ రాష్ట్రాలే భరించాలి.  

మరిన్ని వార్తలు