పోలవరంపై 20న ఢిల్లీలో కీలక భేటీ

9 Nov, 2023 04:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును గడువు­లోగా పూర్తిచేయడానికి ప్రస్తుత సీజన్‌ (2023–­24)లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్‌ ప్లాన్‌), సవరించిన అంచనా వ్యయం (తొలిదశ పూర్తి) ఖరారే అజెండాగా ఈనెల 20న ఢిల్లీలో కేంద్రం కీలక సమా­వేశం నిర్వహిస్తోంది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ కుశ్వీందర్‌సింగ్‌ వోరా, జల్‌శక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘు­రాం, రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూ­షణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు పాల్గొంటారు.

ప్రాజెక్టు పనుల పురోగతిని పీపీఏ సభ్య కార్యదర్శి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించనున్నారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల సీపేజీకి అడ్డుకట్ట వేయడం, దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ స్థానంలో కొత్తది నిర్మించాలా? పాతదానికే మరమ్మతు చేయాలా? వంటి అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి వీలుగా ప్రస్తుత సీజన్‌లో చేపట్టాల్సిన పనులను, అందుకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు.

పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారు చేసింది. ఇందులో ఇప్పటికే రూ.16,119.57 కోట్ల పనులు పూర్తయ్యాయి. మిగతా పనులకు రూ.15,505.81 కోట్లు అవసరమని కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇచ్చింది. సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (ఆర్‌సీసీ)ని నియమించింది. ఆ కమిటీ అడిగిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపింది. ఈనెల 20న జరిగే సమావేశంలో తొలిదశ సవరించిన అంచనా వ్యయంపై చర్చించనున్నారు.   

మరిన్ని వార్తలు