ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధం

12 Mar, 2023 20:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను రేపు(సోమవారం) ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకూ  ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని నియోజక వర్గాలకు సీనియ ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించినట్లు ఆయన తెలిపారు. ఆదివారం సచివాలయం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.

శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపూర్-కర్నూలు మూడు పట్టభద్రుల నియోజక వర్గ  స్థానాలకు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపూర్-కర్నూలు రెండు ఉపాధ్యాయ నియోజక వర్గ స్థానాలకు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కర్నూలు స్థానిక సంస్థల నియోజక వర్గ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయన్నారు. అయితే అనంతపూర్, కడప, నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు స్థానిక సంస్థల నియోజకవర్గ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మినహా ఇంకా ఏఒక్కరూ  ఈ స్థానాలకు పోటీ చేయకపోవడం వల్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవ ఎంపికైన్లటు ప్రకటించినట్లు ఆయన తెలిపారు.

అనంతపూర్ స్థానిక సంస్థల నియోజక వర్గానికి ఎస్.మంగమ్మ, కడప  స్థానిక సంస్థల నియోజక వర్గాని రామ సుబ్బారెడ్డి పొన్నపురెడ్డి, నెల్లూరు నియోజక వర్గానికి  మెరిగ మురళీధర్, తూర్పు గోదావరి నియోజకవర్గానికి  కుడిపూడి సూర్యనారాయణ రావు, చిత్తూరు స్థానిక సంస్థల నియోజక వర్గానికి సుబ్రహ్మణ్యం సిపాయి అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపికయ్యారన్నారు.

సోమవారం జరుగబోయే ఎన్నికల్లో 3 పట్టభద్రుల స్థానాలకు 108 మంది, 2 ఉపాధ్యాయ స్థానాలకు 20 మంది, 3 స్థానిక సంస్థల స్థానాలకు 11 మంది అభ్యర్థులు  పోటీ చేస్తున్నట్లు  ఆయన తెలిపారు. మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 10,00,519 పట్టభద్రులైన ఓటర్లు, రెండు ఉపాధ్యాయ స్థానాల ఎన్నికల్లో  55,842 మంది ఓటర్లు.. మూడు స్థానిక సంస్థల నియోజక వర్గాల ఎన్నికల్లో 3,059 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు.

ఇందుకు 3 పట్టభద్రుల స్థానాల ఎన్నికకు 1,172 పోలింగ్ స్టేషన్లను, 2 ఉపాధ్యాయ స్థానాల ఎన్నికకు 351 పోలింగ్ స్టేషన్లను  మరియు 3 స్థానిక సంస్థల స్థానాల ఎన్నికలకు 15 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే మొత్తం 1,538 పోలింగ్ స్టేషన్లలో 584 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించడం జరిగిందని, వీటిలో పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో పాటు పోలింగ్ కేంద్రాలకు వెలుపల కూడా వీడియోగ్రఫీని చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎపిక్‌తో పాటు పది రకాల గుర్తింపు కార్డుల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం కల్పించామన్నారు. ఎన్నికలు జరిగే 13వ తేదీ, ఓట్ల లెక్కింపు జరిగే 16వ తేదీల్లో ఏ కేంద్రాల్లో అయితే ఈ పక్రియ జరుగుతుందో ఆ కేంద్రాల్లో అవసరాన్ని బట్టి స్థానికంగా సెలవు దినాన్ని ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. అదే విధంగా 13 వ తేదీ జరిగే ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా స్పెషల్ క్యాజువల్ లీవ్లు/ పర్మిషన్లు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు.

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల్లో బ్యాలెట్ ప్యాపర్‌పై వైలెట్ కలర్ ఇంక్ పెన్ ద్వారానే సంఖ్యలను గుర్తిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. సోమవారం సాయంత్రం 4.00 గంటల కల్లా పోలింగ్ ముగుస్తుందని, అయితే 4.00 గంటల కల్లా ఎవరైతే క్యూలైన్లో ఉంటారో వారందరికీ స్లిప్‌ను అందజేసి ఓటు హక్కును వినియోగించుకొనేందుకు అవకాశం  కల్పిస్తామని తెలిపారు.
చదవండి: తోడు దొంగలు.. యథేచ్ఛగా అక్రమాలు, ఆర్బీఐ నిబంధనలు బేఖాతరు

మరిన్ని వార్తలు