ఇక ప్రత్యేక గుర్తింపుతోనే మొబైల్‌ నంబర్‌! 

10 Nov, 2023 05:08 IST|Sakshi

యూనిక్‌ ఐడీ నంబర్‌తో జారీ చేసేందుకు కేంద్రం సన్నాహాలు

ఎన్ని సిమ్‌లు ఉన్నా.. ఒకటే ఐడీ నంబర్‌

సైబర్‌ వేధింపులు, ఆన్‌లైన్‌ మోసాల కట్టడికి నిర్ణయం

సాక్షి, అమరావతి: సైబర్‌ వేధింపులు, ఆన్‌లైన్‌ మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ప్రతి మొబైల్‌ ఫోన్‌ వినియోగదారునికి ‘యూనిక్‌ ఐడీ(ప్రత్యేక గుర్తింపు) నంబర్‌’ కేటాయించాలని నిర్ణయించింది. ఓ వ్యక్తికి ఎన్ని మొబైల్‌ ఫోన్లు ఉన్నా, ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నా సరే.. ఐడీ నంబర్‌ మాత్రం ఒకటే ఉండేలా కార్యాచరణను రూపొందించింది. ఈ ఏడాది చివరినాటికే ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది.  

జనాభా కంటే సిమ్‌కార్డులే అధికం..! 
మొబైల్‌ టెక్నాలజీ ప్రజలకు ఎంత సౌలభ్యంగా ఉందో.. సైబర్‌ నేరస్తులకు అంత ఉపయోగకరంగా మారిందన్నది వాస్తవం. దేశంలో అత్యధిక ప్రాంతాల్లో జనాభా కంటే మొబైల్‌ ఫోన్లు/సిమ్‌ కార్డులే అధికంగా ఉండటం గమనార్హం. 2022 డిసెంబర్‌ నాటికి దేశంలో 114 కోట్ల మొబైల్‌ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్షన్లు 10.7 కోట్లుండగా.. ప్రైవేటు టెలికాం కంపెనీల కనెక్షన్లు 102 కోట్లకుపైనే ఉన్నాయి.

దేశంలో ప్రస్తుతం అమ­లు­లో ఉన్న టెలికాం నిబంధనల మేరకు జమ్మూ–కశీ్మర్, ఈశాన్య రాష్ట్రాల్లో మినహా మిగిలిన చోట్ల ఒక వ్యక్తి పేరిట గరిష్టంగా 9 సిమ్‌ కార్డులు ఉండవచ్చు. జమ్మూ–కశీ్మర్, ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్టంగా 6 సిమ్‌ కార్డులు ఉండవచ్చు. కానీ ప్రైవేటు టెలికాం కంపెనీల ఫ్రాంచైజీలు కొన్ని సిమ్‌ కార్డుల విక్రయంలో నిబంధనలను పాటించడం లేదు. దీంతో సైబర్‌ నేరస్తులు వేర్వేరు పేర్లతో ఫోన్‌ కనెక్షన్లు, సిమ్‌ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

2022లో భారత్‌లో జరిగిన సైబర్‌ మోసా­లు, వేధింపుల్లో 65 శాతం దొంగ సిమ్‌కార్డులతో చేసినవేనని నేషనల్‌ సైబర్‌ సెల్‌ నివేదిక వెల్లడించింది. వేర్వేరు పేర్లతో సిమ్‌ కార్డులు తీసుకొని ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడటంతో పాటు సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రొఫైల్స్‌ పెట్టి మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. 2022లో దేశంలో నమోదైన మొత్తం నేరాల్లో.. సోషల్‌ మీడియాకు సంబంధించినవే 12 శాతం ఉండటం గమనార్హం.  

14 అంకెలతో యూనిక్‌ ఐడీ నంబర్‌.. 
సోషల్‌ మీడియా వేధింపులు, ఆన్‌లైన్‌ మోసాల కట్టడికి దేశంలో మొబైల్‌ ఫోన్ల కనెక్షన్ల వ్యవస్థను గాడిలో పెట్టాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది.  టెలికాం శాఖతో కలసి కార్యాచరణను రూపొందించింది. మొబై­ల్‌ వినియోగదారులు అందరికీ యూ నిక్‌ ఐడీ నంబర్‌ కేటాయించాలని నిర్ణయించింది. ఇది 14 అంకెలతో ఉండనుంది. ఓ వ్యక్తి పేరిట ఎన్ని ఫోన్‌ కనెక్షన్లు ఉన్నా సరే యూనిక్‌ ఐడీ నంబర్‌ మా త్రం ఒక్క­టే ఉంటుంది.

దేశంలో ఎక్కడ సిమ్‌ కార్డు కొను­గోలు చేసినా.. ఏ ప్రాంతంలో ఫోన్‌ను ఉప­యో­గి­స్తున్నా సరే యూనిక్‌ ఐడీ నంబర్‌ మాత్రం అదే ఉంటుంది. వినియోగదారుల ఫోన్‌కు మెసేజ్‌ పంపిం­చి.. ఓటీపీ ద్వారా నిర్ధారించి.. యూనిక్‌ ఐడీ నంబ­ర్‌ కేటాయించాలని కేంద్ర టెలికాం శాఖ భావిస్తోంది. త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనుంది.  

‘అస్త్ర’ అప్‌డేట్‌.. 
సిమ్‌కార్డు మోసాలను అరికట్టేందుకు ఉద్దేశించిన కేంద్ర టెలికాం శాఖకు చెందిన ‘అస్త్ర’ సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించనున్నారు. మొబైల్‌ కనెక్షన్ల కోసం సమర్పించిన గుర్తింపు కార్డులు, ఫొటోలు సక్రమంగా ఉన్నాయో, లేదో గుర్తించడంతోపాటు సంబంధిత దరఖాస్తుదారులకు అప్పటికే యూనిక్‌ ఐడీ నంబరు కేటాయించారా, లేదా అనే విషయాలను కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరిశీలించనున్నారు.

తద్వారా నకిలీ సిమ్‌కార్డులు, వేర్వేరు పేర్లతో ఉన్న సెల్‌ఫోన్‌ కనెక్షన్లకు చెక్‌ పెడతాఱు. ఈ విధానం ద్వారా ఎక్కడైనా సైబర్‌ కేసు నమోదవ్వగానే.. నిందితులను సులభంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ సిమ్‌ కార్డు ఎవరి పేరుతో ఉంది.. యూనిక్‌ ఐడీ నంబర్‌తో సరిపోలుతోందా, లేదా అనే విషయాలను నిర్ధారించవచ్చని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు