ఆస్పత్రుల వ్యర్థాలపై నిఘా

22 Sep, 2023 04:24 IST|Sakshi

నిబంధనల్ని పటిష్టం చేసిన ప్రభుత్వం

ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి నిత్యం 1.40 టన్నుల బయో మెడికల్‌ వ్యర్థాలు

ఆస్పత్రి యాజమాన్యాలకు కాలుష్య నియంత్రణ మండలి అవగాహన

లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆస్పత్రులలోని వ్యర్థాల (బయో మెడికల్స్‌) సేకరణ, నిర్వీర్యంపై ప్రభుత్వం నిబంధనల్ని కఠినతరం చేసింది. ఆస్పత్రి నుంచి సేకరించిన వ్యర్థాలు కంపెనీకి తీసుకెళ్లి నిర్వీర్యం చేసేవరకూ నిరంతరం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడా బయో మెడికల్‌ వ్యర్థాలను బయట వేయకుండా.. కచ్చితంగా వాటిని నిర్వీర్యం చేసేలా వ్యవస్థను పటిష్టం చేశారు. వాహనాలకు జీపీఎస్‌ సిస్టమ్‌ అమర్చారు.

ఆస్పత్రిలో వ్యర్థాలను సేకరించినప్పుడు, కంపెనీకి తరలించిన తర్వాత బ్యాగ్‌లను స్కాన్‌ చేసేలా బార్‌ కోడింగ్, కంపెనీ వద్ద ఆన్‌లైన్‌ ఎమిషన్‌ మోనిటరింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు వంటి విధానాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 17,200 బెడ్స్‌ ఉండగా.. నిత్యం 5 వేల బెడ్స్‌పై రోగులు చికిత్స పొందుతుంటారని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) లెక్కలు చెబుతున్నాయి. ప్రతి రోజూ 1.20 టన్నుల నుంచి 1.40 టన్నుల బయో మెడికల్‌ వ్యర్థాల సేకరణ, నిర్వీర్యం జరుగుతున్నట్టు పీసీబీ అధికారులు చెపుతున్నారు.  

తరలింపు.. నిర్వీర్యంపై నిఘా 
బయో మెడికల్‌ వ్యర్థాలను సంబంధిత కంపెనీకి ఖచ్చితంగా తరలించేలా ప్రభుత్వం నిఘా పటిష్టం చేసింది. ప్రతి బ్యాగ్‌కు బార్‌ కోడింగ్‌ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నుంచి సేకరించేటప్పుడు బార్‌ కోడింగ్‌ను స్కాన్‌ చేయడంతో పాటు కంపెనీకి తరలించిన తర్వాత దానిని స్కాన్‌ చేయాల్సి ఉంది. అప్పుడే దానిని నిర్వీర్యం చేసేందుకు తరలించినట్టు నిర్థారణ అవుతుంది. ఆస్పత్రి యాజమాన్యాలకు మొబైల్‌ యాప్‌ ప్రవేశ పెట్టారు.

ఈ యాప్‌లో ప్రతిరోజూ ఆస్పత్రిలో ఎన్ని పడకలపై రోగులు ఉన్నారు. ఆ రోజు వ్యర్థాలు ఎంత ఉన్నాయి అనే విషయాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. బయో మెడికల్‌ వ్యర్థాలను తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నుంచి సేకరించిన వ్యర్థాలు కంపెనీ వద్దకు వెళ్లాయా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాయా అనే దానిపై నిఘా వేస్తారు.

జగ్గయ్యపేట సమీపంలో బయో వ్యర్థాల నిర్వీర్యం ప్లాంట్‌ ఉంది. ఆ ప్లాంట్‌లో వ్యర్థాల నిర్వీర్యం ప్రక్రియను నిరంతరం ఆన్‌లైన్‌ ఎమిషన్‌ మోనిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా పరిశీలిస్తుంటారు. అక్కడ ఎంత డిగ్రీల్లో నిర్వీర్యం చేస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వీర్యం సమయంలో వచ్చే పొగలో ఏమైనా రసాయనాలు ఉన్నాయా, హానికర కాలుష్యం వస్తోందా అనే అంశాలను పరిశీలిస్తారు.

వ్యర్థాలకు కలర్‌ కోడింగ్‌  
ఆస్పత్రిలోని వ్యర్థాలకు కలర్‌ కోడింగ్‌ను ఏర్పాటు చేశారు. పసుపు, ఎరుపు, బ్లూ, తెలుపు నాలుగు రంగుల్లో ఉన్న బ్యా­గు­ల్లో నిర్ధేశించిన వ్యర్థాలను ఆస్ప­త్రి సిబ్బంది వేసేలా ఇప్పటికే అవగాహ­న కల్పించారు. పసుపు బ్యాగుల్లో మా­న­వ శరీర సంబంధమైన వ్యర్థాలు, జంతు శరీ­ర సంబంధమైన వ్యర్థాలు, మా­య, కలుషిత దూది, డ్రెస్సింగ్‌ క్లాత్, విషపూరిత వ్యర్థాలు, గడువు ముగిసిన మందులు, మాస్‌్కలు వేస్తారు. వీటిని కంపెనీకి తరలించి 1,200 డిగ్రీల వద్ద నిర్వీ­ర్యం చేస్తారు.

ఎరుపు బ్యాగుల్లో సిరంజీలు, ఐవీ సెట్, కాథెటర్, గ్లౌజు­లు, బ్లడ్‌ బ్యాగ్స్, యూరిన్‌ బ్యాగ్స్, డయాలసిస్‌ కిట్, ఐవీ బాటిల్స్‌ వేసేలా ఏర్పా­ట్లు చేశారు. తెలుపు బ్యాగ్స్‌లో సూ­దు­లు, స్థిర సూదులు, సిరంజిలు, బ్లేడ్లు, శస్త్ర చికిత్స బ్లేడ్లు వేస్తారు. బ్లూ బ్యాగ్స్‌ గ్లాసుతో చేసిన ఇంజెక్షన్‌ బాటి­ల్స్, గాజు సీసాలు, ల్యాబ్‌ స్లైడ్స్, ఇంప్లాంట్స్, కత్తెరలు వేసేలా అవగాహన కల్పించారు.

అవగాహన కలిగిస్తున్నాం 
ప్రతి ఆస్పత్రిలో వ్యర్థాలను నిబంధనల మేరకు కలర్‌ కోడింగ్‌ ఆధారంగా వేరు చేయాలని యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యర్థాల తరలింపు, నిర్వీర్యం వంటి వాటిపై నిరంతర నిఘా ఏర్పాటు చేశాం.   – పి.శ్రీనివాసరావు, ఎన్విరాన్‌మెంటల్‌  ఇంజినీర్, కాలుష్యనియంత్రణ మండలి

మరిన్ని వార్తలు