అల్‌-షిఫా ఆస్పత్రి ఎమ్ఆర్‌ఐ సెంటర్‌లో హమాస్ ఆయుధాలు!

16 Nov, 2023 12:55 IST|Sakshi

గాజా: అల్‌ షిఫా ఆస్పత్రిని హమాస్ ఉగ్రవాదులు తమ స్థావరంగా మార్చుకున్నారని గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే అందుకు తగిన ఆధారాలను కూడా బయటపెట్టింది. తాజాగా అల్‌-షిఫా ఆస్పత్రిలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సేనలు హమాస్ దాచిన ఆయుధాలను బయటపెట్టారు. ఆస్పత్రి ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ సెంటర్‌లో హమాస్ కమాండ్ కేంద్రాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి జోనాథన్ కాన్రికస్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేశారు.

 ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ కేంద్రంలో హమాస్ ఆయుధాలకు సంబంధించిన బ్యాగులు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి జోనాథన్ కాన్రికస్ స్వయంగా వెల్లడించారు. ఆ బ్యాగుల్లో ఏకే-47 వంటి భారీ స్థాయి తుపాకులు, మందుగుండు సామగ్రి కనిపించాయని ఆయన వీడియోలో చూపించారు. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఆస్పత్రులను హమాస్ ఉగ్రవాద కేంద్రంగా మార్చిందని ఆయన ఆరోపించారు.

అల్‌-షిఫా ఆస్పత్రిని హమాస్ స్థావరంగా మార్చుకుందని ఇజ్రాయెల్ సేనలు ఆరోపిస్తున్నాయి. ఆస్పత్రి అంతర్భాగంలో సొరంగాలు ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాదుల ఇళ్ల నుంచి ఆస్పత్రికి నేరుగా సొరంగ మార్గాలను కనుగొన్నామని సైన్యం వెల్లడించింది.  అల్‌-షిఫా ఆస్పత్రి పరిసరాల్లో కొద్ది రోజుల పాటు హమాస్-ఇజ్రాయెల్ సేనలకు మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఆస్పత్రికి కొద్ది రోజులుగా నీరు, ఆహారం, ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో చిన్నారులతో సహా వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. 

ఇదీ చదవండి: జిన్‌పింగ్ ఓ నియంత.. బైడెన్ నోట మళ్లీ అదే మాట!

మరిన్ని వార్తలు