Nandyal: అత్యాధునికంగా సర్వజనాసుపత్రి

11 Jan, 2023 20:07 IST|Sakshi

అందుబాటులోకి ఆధునిక వైద్య పరికరాలు 

రూ.5 కోట్లతో ఆధునికీకరించిన ప్రభుత్వం 

కార్పొరేట్‌ ఆసుపత్రులను తలదన్నేలా ఏర్పాట్లు 

ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు

బొమ్మలసత్రం: పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కార్పొరేట్‌ ఆసుపత్రులను తలదన్నే రీతిలో ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతోంది. ఈ కోవలోనే నంద్యాల సర్వజన ఆసుపత్రిలో రూ.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలను సమకూర్చడంతో పాటు వివిధ విభాగాలకు ప్రత్యేక గదులను నిర్మించింది. ఆసుపత్రి ఏర్పాటైనప్పటి నుంచి ఈ స్థాయిలో ఆధునీకరించడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం.

అందుబాటులోకి తీసుకొచ్చిన అధునాతన యంత్రాల ద్వారా ఆర్థోపెడిక్, జనరల్‌ సర్జరీ, ఈఎన్‌టీ విభాగాల్లో దాదాపు 23 రకాల శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయనున్నారు. ఇవే కాకుండా సిబ్బంది కోసం ప్రత్యేకంగా 18 గదులను నిర్మించారు. ఇదే సమయంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామకం కూడా పూర్తి చేశారు. 


అందుబాటులోకి ఆధునాతన వైద్యం 

నంద్యాల జిల్లా కేంద్రంలో రూ.500 కోట్లతో మెడికల్‌ కళాశాల రూపుదిద్దుకుంటోంది. స్థానిక సర్వజన ఆసుపత్రిలో ఇప్పటికే ఓపీ భవనం, జిరియాట్రిక్‌ భవనం, డీఈఐసీ భవన నిర్మాణాలు పూర్తి చేసి ప్రతి రోజు 1,400 మందికి పైగా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆసుపత్రిలోని పాడుబడిన భవనంలోనే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆసుపత్రి రూపురేఖలు మార్చేయడంతో ఆపరేషన్‌ థియేటర్‌లో మెరుగైన వైద్యం అందుతోంది. 

ఈ శస్త్ర చికిత్సలన్నీ ఇక్కడే.. 
ఆర్థో విభాగం: చేతులు, కాళ్లలో విరిగిన ఎముకలకు సర్జరీ, ఎముకలకు రాడ్‌లు, ప్లేట్లు అమర్చడం చేస్తారు. 
జనరల్‌ సర్జరీ విభాగం: హెర్నియా, హైడ్రోసిల్, అపెండిక్స్, పైల్స్, పిస్టులా, కొలొసెక్టమి, పారాటిడ్, పర్ఫరేషన్, లంప్‌ బ్రిస్ట్, సింపుల్‌ థైరాయిడ్, లాప్రోస్కోపిక్‌ శస్త్ర చికిత్సలు. 
ఈఎన్‌టీ విభాగం: అడినో టోన్సిలెక్టోమీ, టింపోనిప్లాస్టి, మిరిన్గోటోమి,   సెప్టోప్లాస్టి, ఫెస్, టర్బినో ప్లాస్టి తదితరాలు. 


అధునాతన యంత్రాలు.. ఉపయోగాలు 

► ఎండోస్కోపి యంత్రం: ఈ యంత్రాన్ని రూ.20 లక్షలతో ఏర్పాటు చేశారు. కడుపు లోపలి భాగంలోని అల్సర్, క్యాన్సర్‌ గడ్డలను సులభంగా గుర్తిస్తుంది.  

► లాప్రోస్కోపి : ఈ యంత్రం దాదాపు కార్పొరేట్‌ ఆసుపత్రులకే పరిమితం. పేదలకు నాణ్యమైన వైద్యం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.22 లక్షలతో ప్రభుత్వాసుపత్రిలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. కోత లేకుండా శరీరంపై చిన్న రంద్రం చేసి ఆపరేషన్‌ చేయడం ఈ యంత్రం ప్రత్యేకత. 

► సీఏఆర్‌ఎం : ఈ యంత్రం ఖరీదు రూ.12 లక్షలు. ఆపరేషన్‌ తర్వాత ఎముకలు సరైన క్రమంలో అమర్చినట్లు నిర్ధారించుకుంటారు. 

► హారిజాంటల్‌ ఆటోక్లేవ్‌: ఈ యంత్రాల ఖర్చు రూ.11 లక్షలు. 120 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆపరేషన్‌కు ఉపయోగించే పరికరాలు, బట్టలపై క్రిములను నశింపజేస్తాయి.  

► ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌: ఆసుపత్రిలో ఆక్సిజన్‌ నిల్వలు పూర్తిగా ఖాళీ అయినప్పుడు ఈ యంత్రం ద్వారా రోగికి కృత్తిమ ఆక్సిజన్‌ అందిస్తారు. ఈ యంత్రం ఖరీదు రూ.50వేలు. 

అవసరానికి తగిన విధంగా ప్రత్యేక గదులు 
► సీఎస్‌ఎస్‌డీ గది: ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన ప్రీ మెటీరియల్‌ను ఆసుపత్రిలో అవసరమయ్యే గదులకు పంపుతారు. 
► సెప్టిక్‌ ఓపి గది: శరీరంలోని గాయాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకి సెప్టిక్‌ అయితే వారికి ఈ గదిలో చికిత్సలు అందిస్తారు. 
► స్టాఫ్‌ నర్సులు, సర్జరీ వైద్యుల కోసం ప్రత్యేకంగా రెండు గదులు ఏర్పాటు. 
► ప్రీ అనస్తీషియా గది: అనస్తీషీయా డ్రెస్సింగ్‌ గదులు నిర్మించారు.  
► థియేటర్‌లో సిలిండర్‌ స్టోర్, శస్త్రచికిత్సలకు అవసరమయ్యే పరికరాలకు ప్రత్యేక గదులు. 
► పీజీ విద్యార్థులకు అవసరమయ్యేలా స్టూడెంట్‌ డెమో గది. 
► అనస్తీషియా ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ప్రత్యేక గదులు. 
► ఆపరేషన్‌ తరువాత శుభ్రం చేసిన నీటిని డర్టీకారిడార్‌ ద్వారా బయటకు పంపేందుకు డిస్పోజల్‌ జోన్‌. 
► ఆపరేషన్‌ థియేటర్‌లో మందులు నిల్వకు డ్రగ్స్‌ స్టోర్‌. 

ఆపరేషన్‌ థియేటర్‌ను ఆధునీకరించాం 
నాలుగు నెలలుగా ఆపరేషన్‌ థియేటర్‌లో చేపట్టిన పనులన్నీ పూర్తయ్యాయి. రోగులకు శస్త్ర చికిత్సలన్నీ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చేస్తాం. ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.5 కోట్లు ఖర్చు చేసింది. కార్పొరేట్‌ ఆసుపత్రులను తలదన్నే రీతిలో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంతో పేదలకు మెరుగైన వైద్యం మరింత చేరువ కానుంది. 
– ప్రసాదరావు, సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్, నంద్యాల

మరిన్ని వార్తలు