కరెంటు కోతల్లేని పల్లె

28 Jan, 2021 04:14 IST|Sakshi

లోవోల్టేజీ ఒకప్పటి మాట 

రైతు మోటర్‌కు ఫుల్‌ ‘పవర్‌’ 

పైరవీల్లేకుండా కొత్త కనెక్షన్లు 

ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే 48 గంటల్లోనే.. 

గ్రామీణ వెలుగుల దిశగా కొత్త సబ్‌స్టేషన్లు 

పల్లెపల్లెకు రూ.కోట్ల ఖర్చుతో విద్యుత్‌ లైన్లు 

సాక్షి, అమరావతి: పల్లెల్లో ఏడాదిగా విద్యుత్‌ కోతల్లేవు. లోవోల్టేజీ మాటే వినిపించడం లేదు. ఫ్యూజుపోతే చీకట్లో మగ్గే దుస్థితి కనుమరుగైంది. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయిందంటే సిబ్బంది వెంటనే వాలిపోతున్నారు. 48 గంటల్లోనే కొత్తది బిగిస్తున్నారు. రైతన్నకు తొమ్మిది గంటల పగటి విద్యుత్‌ నాణ్యంగా ఉంటోంది. విద్యుత్‌ కనెక్షన్ల కోసం పైరవీలు చేయాల్సిన పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పార్టీలు, వర్గాలతో పనిలేకుండానే దరఖాస్తు చేసుకున్నవారికి కొత్త కనెక్షన్లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామీణ విద్యుత్‌ రంగంలో తీసుకొచ్చిన మార్పులివి. 

ఏడాదిలోనే 37 శాతం  తగ్గిన అంతరాయాలు 
కరెంట్‌ పోతే..  గ్రామ సచివాలయానికి సమాచారం ఇస్తే సరిపోతుంది. ప్రతి గ్రామంలోను దీనిపై విస్తృత అవగాహన ఏర్పడింది. ఫలితంగా గడచిన ఏడాది కాలంలోనే విద్యుత్‌ అంతరాయాలు 37 శాతం తగ్గాయి. గతంలో మూడూళ్లకు ఒక కరెంట్‌ లైన్‌మెన్‌ ఉండేవారు. ఇప్పుడు ప్రతి గ్రామ సచివాలయంలోను ఎనర్జీ అసిస్టెంట్‌ ఉన్నారు. అతడికి అన్ని విధాల శిక్షణ ఇచ్చారు. దీనికి తోడు విద్యుత్‌ సరఫరా వ్యవస్థను బలోపేతం చేశారు. ట్రాన్స్‌కో రూ.382.18 కోట్లతో.. 400 కేవీ, 200 కేవీ, 132 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించింది. ఇందుకోసం రూ.85.40 కోట్లు వెచ్చించి 389.75 కిలోమీటర్ల మేర కొత్తగా విద్యుత్‌ లైన్లు వేశారు. దీనికితోడు పల్లెపల్లెకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యుత్‌ సంస్థలు 77 కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించాయి. 19,502.57 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు వేశాయి. ఇందుకోసం రూ.524.11 కోట్లు ఖర్చు పెట్టాయి. ఫలితంగా విద్యుత్‌ పంపిణీ, సరఫరా వ్యవస్థ మరింత బలోపేతమైంది. దీంతో విద్యుత్‌ అంతరాయాలు గణనీయంగా తగ్గాయి.

ఊరూరా ఆధునిక పరిజ్ఞానం 
పల్లెకు అందించే విద్యుత్‌ వ్యవస్థను అత్యాధునిక టెక్నాలజీతో అనుసంధానం చేశారు. విద్యుత్‌ లోడ్‌ను ఇట్టే పసిగట్టి, అవసరమైన విద్యుత్‌ను కొనైనా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియలో రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) కీలకపాత్ర పోషిస్తుంది. ఈ విభాగంలోను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్‌ డిమాండ్‌ను ముందే గుర్తించి, అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి కేంద్రాలకు, పంపిణీ సంస్థలకు సరైన సమయంలో ఆదేశాలిస్తున్నారు. దీనివల్ల గ్రిడ్‌పై లోడ్‌ను అదుపులో ఉంచడం సాధ్యమవుతోంది. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం వల్ల ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల నష్టాలు తగ్గాయి. 2018–19తో పోలిస్తే 2019–20లో ట్రాన్స్‌కో నష్టాలు 2.91 శాతానికి, డిస్కమ్‌ల నష్టాలు 6.21 శాతానికి తగ్గాయి. 

మరిన్ని వార్తలు