బడివేళకు విద్యాకానుక రెడీ 

27 May, 2022 22:53 IST|Sakshi
స్కూల్‌  కాంప్లెక్స్‌ చేరిన నోట్‌బుక్స్‌  

2022–23 ఏడాదికి అర్హుల జాబితా సిద్ధం 

విద్యా సంవత్సరం ప్రారంభం రోజున అందించేందుకు చర్యలు  

జిల్లాకు చేరుతున్న జగనన్న విద్యాకానుక సామగ్రి  

కడప ఎడ్యుకేషన్‌:  పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదు. విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఇది గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో నాడు – నేడు కింద పలు పాఠశాలలను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం రెండవ విడత పనులను కూడా ప్రారంభించారు.

దీంతోపాటు పేద పిల్లల చదువులకు ఊతమిచ్చేలా 8 రకాల  విద్యాసామగ్రిని జగనన్న విద్యాకానుక కిట్ల రూపంలో అందించనున్నారు. వీటిని పాఠశాలలు తెరిచే రోజే పిల్లల చేతికి అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. విద్యాకానుక కిట్లు జిల్లాకు రావడం ప్రారంభమైంది. ప్రస్తుతం నోట్‌బుక్స్‌ జిల్లాలోని పలు స్కూల్‌ కాంప్లెక్స్‌లకు చేరుతున్నాయి. మిగతా వస్తువులు త్వరలో రానున్నాయి.   

ఏర్పాట్లు ప్రారంభం  
జగనన్న విద్యాకానుక పంపిణీకి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మున్సిపల్, ఎయిడెడ్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయులకు సమావేశాలు నిర్వహించి కిట్ల పంపిణీపై అవగాహన కల్పించారు. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో 3373 పాఠశాలలకు చెందిన 2,67,317 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక లబ్ధి చేకూరనుంది.  

జిల్లాకు చేరుతున్న విద్యా కానుక  
జగనన్న విద్యాకానుక కిట్‌లో స్కూల్‌ బ్యాగ్, నోట్‌పుస్తకాలు, షూస్, 2 జతల సాక్సులు, 3 జతల యూనిఫాం క్లాత్, బెల్టు ఉంటాయి. గత ఏడాది నుంచి అదనంగా ఇంగ్లిష్‌– తెలుగు డిక్షనరీలు విద్యార్థులకు అందచేజేస్తున్నారు. ప్రస్తుతం విద్యాకానుక కిట్లలో  నోట్‌బుక్స్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌లకు రావడం ప్రాంభమైంది. ఇప్పటి వరకు బద్వేలు, దువ్వూరు, గోపవరం, కలసపాడు, ఖాజీపేట, ముద్దనూరు, మైలవరం, ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల, రాజుపాలెం, కాశినాయన మండలాలకు సంబంధించిన స్కూల్‌ కాంప్లెక్స్‌లకు చేరిపోయాయి.  

పక్కాగా కొలతలు  
విద్యార్థులకు అందించే బూట్ల సైజు కచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో తరగతుల వారిగా విద్యార్థుల కొలతలను సేకరించాము. దాని వివరాలను ఇండెంట్‌ పంపాము. ప్రస్తుతం విద్యాకానుకలో భాగంగా నోట్‌ బుక్స్‌ వస్తున్నాయి. మిగతావి కూడా త్వరలో రానున్నాయి. వచ్చిన కిట్లను ప్రధానోపాధ్యాయులు పరిశీలించుకోవాలి. ఏవైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలి. 
– దిద్దకుంట గంగిరెడ్డి, సీఎంఓ, సమగ్రశిక్ష 

విద్యా సంవత్సరం ఆరంభంలోనే..  
2022–23 విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందజేస్తాం. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే జిల్లాలో అర్హులైన విద్యార్థుల జాబితాను సిద్ధం చేశాం. ఈ ఏడాది 2,67,317 మందికి విద్యాకానుక కిట్లు అందనున్నాయి. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం.  
– డాక్టర్‌ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, సమగ్రశిక్ష జిల్లా పథక అధికారి
 

మరిన్ని వార్తలు