ఏఓబీలో తేలని పంచాయితీ

9 Feb, 2021 08:34 IST|Sakshi
ఏఓబీలోని ఒడిశా ప్రజలతో సమావేశమైన సబ్‌కలెక్టరు సంగ్రాం కేసరి పండా

ఏపీలో వార్డు మెంబరుగా నామినేషన్‌ వేసిన ఒడిశా మహిళ

అప్రమత్తమైన గజపతి జిల్లా అధికార యంత్రాంగం

సరిహద్దు గ్రామస్తులతో చర్చించి, సమస్యల పరిష్కారానికి హామీ

సాక్షి, పర్లాకిమిడి: ఆంధ్రా–ఒడిశా బోర్డురు(ఏఓబీ)లోని గజపతి జిల్లా, గంగాబడ పంచాయతీ గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసిపోయేందుకు మొగ్గుచూపుతుండడంతో అక్కడి ఒడిశా అధికారులకు తలనొప్పులు మొదలయ్యాయి. ప్రధానంగా అటు గజపతి జిల్లా కేంద్రానికి గంగాబడ పంచాయతీ 60 కిలోమీటర్ల దూరంలో ఉండగా, శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం, సాబకోట పంచాయతీకి గంగాబడ పంచాయతీ.. 2 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఆ పంచాయతీ ప్రజలు ఆంధ్రప్రదేశ్‌ పరిధి ప్రాంతంలో ఉండిపోయేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఏపీ(ఆంధ్రప్రదేశ్‌) ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసి, నామినేషన్లు స్వీకరిస్తుండగా, సాబకోట పంచాయతీలో వార్డు మెంబరుగా పోటీ చేసేందుకు గంగాబడ పంచాయతీకి చెందిన ఒడిశా మహిళ లక్ష్మీ సబర శనివారం నామినేషన్‌ వేశారు.

దీంతో అప్రమత్తమైన గజపతి జిల్లా అధికార యంత్రాంగం హుటాహుటిన గంగాబడ పంచాయతీ పరిధిలోని ఏపీలోని మందస మండలం, సాబకోట పంచాయతీకి దగ్గరలో ఉన్న మాణిక్‌ పాట్నా, అక్కుడ, మధికోల్, చంపాపూర్, బురిసింగి, అమారింగి, గురికుడి గిరిజన గ్రామాల్లో సబ్‌కలెక్టరు కేసరి పండా, అక్కడి రెవెన్యూ అధికారులతో పర్యటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారంతా జిల్లా(గజపతి) కేంద్రానికి దూరంగా ఉండడంతో ఒడిశా ప్రభుత్వ పథకాలు తమకు సరిగా అందడం లేదని, ఆంధ్రప్రదేశ్‌కి దగ్గరగా ఉండడంతోనే ఏపీ పథకాలే తమకు అందుతున్నాయని వివరించారు. తమ పిల్లల విద్యాభ్యాసం కూడా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోనే జరుగుతోందని తెలిపారు. దీనిపై స్పందించిన సదరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అందేలా చర్యలు చేపడతామని, ఒడిశాలోనే ఉండాలని కోరగా వారంతా సుముఖత వ్యక్తం చేశారు.

నామినేషన్‌ ఉపసంహరణ.. 
అనంతరం వార్డు మెంబరుగా పోటీకి దిగిన లక్ష్మీ సబరని కలిసిన గజపతి జిల్లా అధికారులు ఆమెతో మాట్లాడి ఆమె వేసిన నామినేషన్‌ని ఉపసంహరించుకోమని కోరారు. 60 ఏళ్ల నుంచి ఒడిశా ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తున్న కారణంగానే విసుగుచెంది ఆంధ్రప్రదేశ్‌లో ఉండిపోవాలనుకుంటున్నట్లు లక్ష్మీ సబర భర్త మాణిక్‌ తెలిపాడు. అయితే ఆఖరికి అధికారుల హామీతో తమ నామినేషన్‌ ఉపసంహరణకు భార్యాభర్తలిద్దరూ ఒప్పుకుని, నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు.

ఎన్నికలు రద్దు చేయాలి.. 
జయపురం: ఏఓబీలోని వివాదాస్పద ప్రాంతంగా గుర్తింపు పొందిన కొఠియా గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని ఉత్కళ సమ్మిళినీ కొరాపుట్‌ జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది. ఈ విషయమై ఆ శాఖ సభ్యులంతా ఉత్కళ సమ్మిళినీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బినోద్‌ పాత్రో నేతృత్వంలో కలెక్టరు మహ్మద్‌ అబ్దుల్‌ని కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు.. కొరాపుట్‌ జిల్లాలోని పొట్టంగి సమితి, కొఠియా గ్రామపంచాయతీలో ఉన్న 3 గ్రామాల పేర్లను మార్చి, అక్కడ ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఫిర్యాదు చేశారు. ఇక్కడి సరిహద్దు గ్రామాల విషయంలో ఎప్పటినుంచో వివాదం కొనసాగుతోందని, అది పరిష్కారం కాకుండా ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకుని, ఆ గ్రామాల్లో జరిగే ఏపీ పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలని కోరారు.

మరిన్ని వార్తలు