Andhra Pradesh: శభాష్‌.. ‘దిశ’

20 Nov, 2022 03:22 IST|Sakshi

మహిళల భద్రతకు కొండంత భరోసా.. 1.10 కోట్ల యాప్‌ రిజిస్ట్రేషన్లు 

ఇప్పటి వరకు 23,000 పైగా కాల్స్‌కు తక్షణ స్పందన

3,560 ఘటనల్లో బాధితులకు పోలీసుల అండ

2,323 ఎఫ్‌ఐఆర్‌ల నమోదు

ఈ వ్యవస్థపై జాతీయ స్థాయిలో ప్రశంసలు

అనంతపురానికి చెందిన లావణ్య విజయవాడలో ఇంటర్‌ చదువుతోంది. ఇటీవల సెలవులకు ఇంటికి వెళ్లింది. తిరిగి కళాశాల వద్దకు వచ్చి దిగబెట్టడానికి తండ్రికి వీలుపడలేదు. బస్సు ఎక్కిద్దామని బస్టాండ్‌కు వచ్చాడు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సెల్‌ఫోన్‌లోని ‘దిశ’ యాప్‌ను ఉపయోగించమని చెప్పాడు. ఇలా ఉపయోగించాలని చూపించబోగా ‘నాన్నా.. నాకు తెలుసులే’ అని లావణ్య చెప్పడంతో జాగ్రత్తలు చెప్పి వెనుదిరిగాడు. ఇలా లక్షలాది మందికి ‘దిశ’ ఓ ఫ్రెండ్‌గా, ఓ సోదరుడిగా, ఓ బాడీగార్డ్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సాక్షి, అమరావతి: సినిమాల్లో చివరి సీన్‌లోనే పోలీసులు వస్తారని ఎన్నో దశాబ్దాలుగా చూపిస్తున్నారు. దుర్ఘటన జరిగాక తీరిగ్గా పోలీసులు వస్తారు తప్ప.. వెంటనే రక్షణ కల్పించరనే అపప్రద దేశ వ్యాప్తంగా పోలీసులపై ఉంది. కానీ, రాష్ట్ర పోలీసు శాఖ ఆ చరిత్రను తిరగరాస్తోంది. ఆపదలో ఉన్నామని ఇలా చెబితే చాలు అలా క్షణాల్లో అక్కడకు చేరుకుని భద్రత కల్పిస్తోంది. మహిళలు సంప్రదించగానే తక్షణం భద్రత కల్పించే వ్యవస్థను రూపొందించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలకు ఆచరణ రూపమే దిశ మొబైల్‌ యాప్‌.

ఇది రక్షణ కోసం మహిళలకు ప్రభుత్వం అందించిన అస్త్రం. ఆధునిక సమాచార సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ రూపొందించిన ఈ యాప్‌ మహిళా భద్రతకు పూర్తి భరోసానిస్తోంది. ఈ యాప్‌ను రికార్డు స్థాయిలో మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకుంటుండటమే అందుకు నిదర్శనం. ఇప్పటి వరకు 1,10,40,102 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏ మొబైల్‌ యాప్‌ను కూడా ఇంత భారీ స్థాయిలో ఎవరూ డౌన్‌లోడ్‌ చేసుకుని, రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు. 

క్షణాల్లో ఆపన్న హస్తం..
ఇప్పటి వరకు దిశ యాప్‌ ద్వారా 9.60 లక్షల ఎస్‌ఓఎస్‌ వినతులు దిశ కమాండ్‌ కంట్రోల్‌కు చేరాయి. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోగానే యాప్‌ పని తీరు పరీక్షించేందుకు చేసే ఎస్‌ఓఎస్‌ వినతులూ అత్యధికంగా ఉన్నాయి. అలాగే, ఇప్పటి వరకు చర్యలు తీసుకోదగిన 23,039 ఎస్‌ఓఎస్‌ వినతులు వచ్చాయి. పోలీసులు తక్షణం స్పందించి చర్యలు చేపట్టారు. ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న 1,237 మందికి భద్రత కల్పించారు. నేరాలకు యత్నించిన కేసుల్లో 2,323 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మొత్తంగా 3,560 ఘటనల్లో బాధితులకు అండగా నిలిచారు. 

పటిష్ట వ్యవస్థతో సమర్థ పర్యవేక్షణ
దిశ యాప్‌ సమర్థవంతంగా పని చేసేందుకు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, 15 మంది ఇతర అధికారులతో కూడిన బృందం 24/7 కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దిశ యాప్‌ పని తీరును సాంకేతిక సమస్యల్లేకుండా చూసేందుకు 51 మందితో కూడిన సహాయక బృందాన్ని కూడా నెలకొల్పింది. ఇక గస్తీ విధుల కోసం 900 ద్విచక్ర వాహనాలతోపాటు 163 బోలెరో వాహనాలను సమకూర్చింది.

దాదాపు 3 వేల పోలీసు వాహనాలకు జీపీఎస్‌ ద్వారా దిశ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానించారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగాన్నీ బలోపేతం చేసింది. కేంద్ర హోంశాఖ ప్రమాణాల ప్రకారం 60 రోజుల్లోపే రాష్ట్ర పోలీసులు అత్యధిక కేసుల్లో చార్జ్‌షీట్‌ దాఖలు చేస్తున్నారు. దోషులను గుర్తించి సకాలంలో శిక్షలు పడేలా చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అత్యాచారం–హత్య కేసుల దర్యాప్తునకు సగటున 222 రోజులు సమయం పట్టగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం సగటున 58 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నారు. 

జాతీయ స్థాయిలో 19 అవార్డులు
దిశ యాప్‌ ప్రభావంతో రాష్ట్రంలో మహిళలపై దాడులు, వేధింపులు తగ్గాయని జాతీయ నేర గణాంకాల నివేదిక (ఎన్‌సీఆర్‌బీ)–2021 వెల్లడించింది. ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో మహిళలపై నేరాల కేసులు 111.2 నమోదవుతుండగా కేరళలో 73.3 కేసులు ఉన్నాయి. అదే ఏపీలో 67.2 కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారం–హత్య కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో ఆరు, 2020లో ఐదు కేసులు నమోదు కాగా 2021లో రెండు కేసులు నమోదయ్యాయి.

అత్యాచారయత్నం కేసులు 2019లో 177, 2021లో 162 కేసులు నమోదయ్యాయి. బాలికలపై అత్యాచార యత్నం కేసులు 2019లో 45, 2020లో 40, 2021లో 35 నమోదయ్యాయి. మహిళలపై దాడుల కేసులు ఎనిమిది శాతం తగ్గాయి. ఇంత సమర్థవంతంగా పని చేస్తున్న దిశ యాప్‌కు జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 19 అవార్డులు వచ్చాయి.

దిశ వ్యవస్థ దేశానికి ఆదర్శం
మహిళా భద్రతను ప్రథమ ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఇందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా దిశ యాప్‌పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. డౌన్‌ లోడ్, రిజిస్ట్రేషన్లపై శ్రద్ధ తీసుకున్నాం. దాంతో ఏపీలో మహిళలపై వేధింపులు తగ్గాయని జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది. దిశ యాప్‌ పనితీరును ఇతర రాష్ట్రాల పోలీసు శాఖలు కూడా పరిశీలించాయి. దిశ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.
– కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, డీజీపీ

దిశ యాప్‌ మహిళలకు ఒక వరం
ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్‌ ఎంతోగానో ఉపయోగపడుతుంది. పోలీస్‌ అవసరం ఉన్న వారు ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కడం ద్వారా సత్వర సహాయం అందుతుంది. ఆపదలో ఉన్నప్పుడు కాల్‌ చేసే అవకాశం లేకపోతే ఫోన్‌ను నాలుగైదుసార్లు షేక్‌ చేస్తే చాలు.. పోలీసులకు సమాచారం అందుతుంది. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ మహిళలపై దాడులు ఆపలేకపోతున్న పరిస్థితుల్లో దిశ యాప్‌ ఒక వరం లాంటిది.
– కె శ్యామల, స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, పోక్సో కోర్టు

యాప్‌పై అవగాహన పెంచుకోవాలి
దిశా యాప్‌ మహిళలకు అండగా నిలుస్తోంది. విద్యార్థినులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది. పెద్దగా చదువుకోని మహిళలు కూడా ఈ యాప్‌ను సులువుగా ఉపయోగించవచ్చు. మహిళలు, విద్యార్థినులు ఈ యాప్‌పై అవగాహన పెంచుకోవాలి.
– పి.రమణమ్మ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, విజయనగరం. 

విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ఓ యువతిని రాంబాబు అనే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించాడు. వారి పెళ్లికి పెద్దలు కూడా సమ్మతించారు. కానీ, ఆ యువతిపై అనుమానం పెంచుకున్న రాంబాబు ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఆమె ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీన్ని గుర్తించిన ఆ యువతి సోదరి దిశ యాప్‌ ద్వారా పోలీసులను సంప్రదించగా వారు కేవలం ఆరు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న రాంబాబును అరెస్టు చేశారు. విజయవాడలో ఓ బిడ్డకు తల్లి అయిన ఒంటరి మహిళను ఓ యువకుడు నమ్మించి మోసగించాడు. దాంతో ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన బిడ్డను సంరక్షించమని దిశ యాప్‌ ద్వారా పోలీసులను కోరింది. పోలీసులు కేవలం 3 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఆమెను మోసగించిన యువకుడిపై కేసు నమోదు చేశారు. 

మహిళలకు ఒక భరోసా
ప్రయాణ సమయంలో దిశ యాప్‌లో ఉండే ట్రాక్‌ మై ట్రావెల్‌ ఆప్షన్‌ ఉపయోగించి గమ్య స్థానాన్ని నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్‌ చేస్తుంది. ప్రయాణించే వాహనం దారి తప్పితే దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు తెలుస్తుంది. అప్పుడు పోలీసులు వెంటనే స్పందించే తీరు హర్షణీయం. సీఎం వైఎస్‌ జగన్‌ మహిళల భద్రతకు ఏర్పాటు చేసిన దిశ యాప్‌ 
ఎంతో భరోసా కల్పిస్తోంది.
– జి.రత్నకుమారి, గృహిణి, గుంటూరు 

మరిన్ని వార్తలు