సీఎంకు కృతజ్ఞతతో..శబరిమలకు పాదయాత్ర

2 Dec, 2023 04:42 IST|Sakshi

అనారోగ్యంతో ఉన్న తన కుమార్తెను ఆదుకోవడంతో సీఎంకు కృతజ్ఞతగా 

పెనుగొండ: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న తన కూతురికి లక్షలాది రూపాయల వ్యయంతో అండగా నిలిచిన సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి అవ­సరమని, పేద ప్రజలకు అండగా నిలిచే నాయకుడు జగనే మళ్లీ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ఓ అయ్యప్ప మాలధారుడు శబరిమలకు పాద­యాత్రను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం తూర్పుపాలెంలో వైఎస్సా­ర్‌­సీపీ జిల్లా అధ్యక్షుడు, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాదయాత్ర పోస్టర్‌­ను ఆవిష్కరించారు.

ఆచంట మండలం అయో­ధ్యలంకకు చెందిన కొప్పాడి రాంబాబు కుమార్తె హనీ చిన్న వయసు­లోనే అరుదైన వ్యాధికి గురైంది. వ్యవసాయం చేసుకొంటూ జీవించే రాంబాబు వైద్యం చేయించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో 2022 జూన్‌ 23న గంటి పెదపూడి వచ్చిన సీఎం జగన్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో సత్వర వైద్యా­నికి ఆర్థికంగా అండగా నిలుస్తానని సీఎం భరోసా ఇచ్చారు. హనీకి ప్రతి నెలా రూ.1.50 లక్షలతో ఇంజక్షన్‌ చేయించవలసి ఉంది. దీనికయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందంటూ సీఎం భరోసా ఇచ్చి అక్టోబర్‌లో వైద్య సహాయం ప్రారంభించారు.

దీనికి గాను ఒకేసారి 40 ఇంజక్షన్లను అందజేశారు. అవి ఇప్పటివరకు రావడంతో మరోసారి 24 ఇంజక్షన్లు 2 రోజుల్లో పంపించనున్నారని రాంబాబు శుక్రవారం తెలిపారు. వైద్యం అందించడమే కాకుండా, కోనసీమ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలోనూ చదువుకునేందుకు ఏర్పాటు చేసి, నెలకు రూ.10 వేలు పింఛన్‌ సౌకర్యం కల్పించారని తెలిపారు. అందుకే సీఎంగా జగనే కావాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ శబరిమల వరకు పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు