టీచర్లను రెచ్చగొట్టేలా ఈనాడు దుర్మార్గపు రాతలు

2 Dec, 2023 04:40 IST|Sakshi

వైఎస్‌ జగన్‌ సర్కారులోనే ఉపాధ్యాయులకు గౌరవప్రద జీవితం

గతంలో ఉపాధ్యాయులను అవమానించింది చంద్రబాబే..

వైఎస్సార్‌సీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులను రెచ్చగొట్టేలా ఈనాడు కథనాలు రాస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈనాడులో ఉపాధ్యాయులపై రాసిన కథనం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రభుత్వ టీచర్లు విద్యార్థుల స్థితిగతులపై డిక్లరేషన్‌ ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారని శుక్రవారం ఈనాడు వార్త ప్రచురించిందని, కానీ ప్రభుత్వం ఎప్పుడూ మౌఖిక ఆదేశాలు ఇవ్వదని, అధికారికంగా పేపర్‌ పరంగా ఆదేశాలుంటాయనేది ఆ పత్రికకు తెలి­యదా అని ప్రశ్నించారు.

ఎవరు మౌఖిక ఆదేశాలి­చ్చారో రాయకుండా టీచర్లను రెచ్చగొట్టేలా రాయడం  దుర్మార్గమన్నారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలున్నా తక్షణమే సీఎం వైఎస్‌ జగన్‌ పరిష్కరిస్తున్నారని గుర్తుచేశారు. ఇకనైనా ఈనాడు  ఇలాంటి అసత్య కథనాలు రాయడం మానుకోవాలని హితవు పలికారు.

గతంలో బాబు ఎంతోమందిని అవమానించారు
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అనంత­పురం ప్రాంతంలో ఒక పాఠశాలలో టీచర్‌ స్కూల్లోని సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసు­కొస్తే.. ఆ టీచర్‌ను యూజ్‌లెస్‌ ఫెలో అంటూ తిట్టి సస్పెండ్‌ చేశారని, అదే జిల్లా శింగనమల ప్రాంతంలో పంచాయతీ అధికారి ఒకరిని జీపుపై ఎక్కించి అవమానించిన ఘనత బాబుదేనన్నారు. టీడీపీ నేత నిమ్మల కిష్టప్ప ఉపాధ్యాయులను చెట్టుకు కట్టేసి కొట్టండి అని గతంలో అన్నారని గుర్తుచేశారు.

కొన్ని పత్రికలు,  ప్రతిపక్షాలు విద్యావ్యవస్థపై బుర­ద­జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయిలో వసతులు కల్పించి, ఉపాధ్యా­యులకు గౌరవాన్ని పెంచిన ఘనత సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు