నియోజకవర్గాల స్థాయిలో.. బ్యాంకింగ్‌ స్టాల్స్‌ను ఏర్పాటుచేయండి

1 Oct, 2021 04:13 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న మంత్రులు కన్నబాబు, పెద్దిరెడ్డి

దరఖాస్తుదారులకు వైఎస్సార్‌ చేయూత రుణాలు సులభంగా లభించాలి

వైఎస్సార్‌ చేయూత కార్యకలాపాలపై పెద్దిరెడ్డి, బొత్స, కన్నబాబు సమీక్ష 

సాక్షి, అమరావతి: నియోజకవర్గాల స్థాయిలో బ్యాంకింగ్‌ స్టాల్స్‌ను ఏర్పాటుచేసి జీవనోపాధి కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు సులభంగా రుణాలు లభించేలా అధికారులు చొరవ తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు ఆదేశించారు. ఈ ఏడాది 60 వేల మంది లైవ్‌స్టాక్స్‌ (పశుసంపద)ను కొనుగోలు చేసేందుకు వైఎస్సార్‌ చేయూత మహిళలు ఉత్సాహకంగా ఉన్నారని, వారికి చేదోడువాదోడుగా అధికారులు ఉండాలని మంత్రులు సూచించారు. గతేడాది నిర్దేశించిన లైవ్‌స్టాక్స్‌ లక్ష్యాన్ని ఈ ఏడాది మరింత పెంచాలని.. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రిటైల్‌ స్టోర్స్‌ను పెద్దఎత్తున ఏర్పాటుచేసేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు పొంది వ్యాపారాలు చేసుకుంటున్న లబ్ధిదారులు సకాలంలో వాటి చెల్లింపులు చేసేందుకు వారిలో ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన కలిగించాలన్నారు. చేయూత మహిళల కార్యకలాపాలపై ఏర్పాటైన మంత్రుల కమిటీ గురువారం సచివాలయంలో సమావేశమై సమీక్షించింది. మంత్రులు ఏమన్నారంటే..

► ఈ పథకం ద్వారా 2020 అక్టోబర్‌ 12న మొదటి విడత కింద 24,00,111 మంది అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.4,500.20 కోట్లు జమచేశాం.
► వ్యాపార దక్షత పెంచేందుకు ఇచ్చిన ప్రోత్సాహంతో వారు గత ఏడాది 78 వేల రిటైల్‌ షాపులు ప్రారంభించారు. అలాగే, 1.19 లక్షల పశువులను, 70,955 జీవాలను కొనుగోలు చేశారు.
► ఈ ఏడాది రెండో విడత కింద జూన్‌ 22న 22,38,648 మంది మహిళల ఖాతాల్లో రూ.4,197.46 కోట్లు జమచేశాం.
► మొదటి ఏడాదిలో మహిళలతో ప్రోక్టర్‌ అండ్‌ గాంబిల్, ఐటీసీ, హెచ్‌యుఎల్, రిలయన్స్‌ రిటైల్, అమూల్, అల్లానా సంస్థలు వ్యాపార ఒప్పందాలు చేసుకున్నాయి. రెండో ఏడాది ఏజియో రిలయన్స్, టానాజర్, జీవీకే, మహేంద్రా టాప్‌ ఖేతి, గెయన్‌ వంటివి ముందుకొచ్చాయి. 
► కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో 1,500 షెడ్‌నెట్‌ హౌస్‌లను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలి.
► రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు బ్రాండింగ్‌ కల్పిస్తూ, చేయూత స్టోర్స్‌లో వాటిని విక్రయించేలా చర్యలు తీసుకోవాలి.
► రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఉత్పత్తులను పై సంస్థల ద్వారా విక్రయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి.

సర్వే పనులు వేగవంతం చేయాలి
ఇక జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకంపై జరిగిన మరో సమావేశంలో.. ఆ సర్వే పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఇందులో మంత్రి ధర్మాన కూడా పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 13 నాటికి 815 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయ్యిందని.. 363 గ్రామాల్లో మ్యాప్‌ల రూపకల్పన పూర్తయ్యిందని.. 279 గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పూర్తయ్యిందని, మరో 84 గ్రామాల్లో పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ సర్వేను ఏడాదిలో పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.  

మరిన్ని వార్తలు