ట్రాన్స్‌కో పటిష్టతతోనే విద్యుత్‌ సమస్యలకు చెక్‌

26 Apr, 2022 04:29 IST|Sakshi

ఏపీ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో రూ.3,897.42 కోట్లతో పనులు 

అధికారులతో సమీక్షలో ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి

సాక్షి, అమరావతి: విద్యుత్‌ సమస్యలకు చెక్‌ పెట్టి, ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలంటే  ఏపీ ట్రాన్స్‌కో పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. ఆయన సోమవారం సచివాలయంలో ట్రాన్స్‌కో అధికారులతో సమీక్ష  నిర్వహించారు.  ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో రూ.3,897.42 కోట్లతో జరుగుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. వీటిలో వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు రూ.223.47 కోట్లతో, గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ కోసం రూ.941.12 కోట్లతో, విశాఖపట్నం–చెన్నై కారిడార్‌లో రూ.605.56 కోట్లతో పనులు జరుగుతున్నాయని వివరించారు. మూడు జోన్లలో సిస్టమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌లో భాగంగా రూ.762.53 కోట్ల పనులు, అలాగే 400 కేవీ సామర్థ్యంతో కూడిన విద్యుత్‌ సరఫరా కోసం రూ.1,257.56 కోట్ల పనులు, ఇతరత్రా రూ.107.18 కోట్ల పనులు జరుగుతున్నట్లు తెలిపారు.  

ఎస్‌ఎస్‌ఆర్‌పై కమిటీ 
ట్రాన్స్‌కో చేపట్టిన పనులకు సంబంధించి ఏటా స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌)పై రివిజన్‌ జరగాలని సూచించారు. ఇందుకోసం వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఇంధనశాఖ కార్యదర్శి  శ్రీధర్, ట్రాన్స్‌ కో జేఎండీ పృధ్వీతేజ్,  డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

అభివృద్ధి పనులకు సకాలంలో అనుమతులు 
రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి, నిర్మాణ పనులకు సకాలంలో నిబంధనలకు అనుగుణంగా అనుమతులివ్వాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం అటవీ శాఖ, ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులతో అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై  సమీక్ష  నిర్వహించారు. పంచాయతీరాజ్, ఆర్‌ అండ్‌ బీ, ఇరిగేషన్, ఎస్‌ఎస్‌ఏ, జెన్‌కో, ట్రాన్స్‌కో, ఏపీఐఐసీ తదితర ఇంజనీరింగ్‌ విభాగాలకు చెందిన పనులు అటవీ ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయన్నారు. అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడం వల్ల ఆయా పనులు ముందుకు సాగడం లేదనే ఫిర్యాదులొస్తున్నాయని తెలిపారు. ఫారెస్ట్‌ కన్సర్వేటివ్‌ యాక్ట్‌ ప్రకారం ప్రభుత్వ విభాగాలు అవసరమైన అనుమతులు పొందడంలో అలసత్వం వహిస్తున్నాయన్నారు. అడవులు, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్, అటవీ దళాల అధిపతి ప్రతీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు