పింఛన్ల పంపిణీ ఇక మూడురోజులు

1 Dec, 2020 06:07 IST|Sakshi

డిసెంబర్‌ నుంచే అమలు.. ఒక్కరూ మిగలకూడదనేదే లక్ష్యం

వరుసగా 3 నెలలు తీసుకోని వారికీ బకాయిలతో కలిపి చెల్లింపు

సచివాలయ కార్యదర్శుల ఖాతాల్లోకి రూ.1,510.9 కోట్లు

సాక్షి, అమరావతి: పింఛనుదారులందరికీ ప్రతినెలా డబ్బు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క లబ్ధిదారు  పింఛను అందక ఇబ్బంది పడకూడదని.. మూడురోజులపాటు పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ నిర్ణయం డిసెంబర్‌ నుంచే అమలుకానుంది. డిసెంబర్‌ పింఛన్లను 1, 2, 3 తేదీల్లో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీ వేతనాలు అందినట్లే అవ్వాతాతలకు ప్రతినెలా ఒకటో తేదీనే పింఛను డబ్బులు అందజేయాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు ఈ ఏడాది జూలై నెల నుంచి పింఛన్ల పంపిణీని ఒకటో తేదీకే పరిమితం చేశారు.

గిరిజన ప్రాంతాలు వంటి మారుమాల ప్రాంతాల్లో రెండురోజుల పాటు పంపిణీకి వీలు కల్పించారు. వలంటీర్లు పంపిణీ చేసేందుకు వెళ్లినప్పుడు ఊళ్లో లేకపోవడం వంటి కారణాలతో ఆ రోజు తీసుకోలేకపోయినవారికి తరువాత నెలలో బకాయితో సహా చెల్లిస్తున్నారు. లబ్ధిదారులెవరూ ఈ విధంగా ఇబ్బంది పడకూడదని, అందరికీ పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో డిసెంబర్‌ నుంచి ప్రతినెలా ఒకటి, రెండు, మూడు తేదీల్లో పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో అందరికీ పింఛను అందే అవకాశం ఉంది. ఏవైనా కారణాల వల్ల ఈ మూడు రోజుల్లో కూడా తీసుకోలేకపోయినవారికి ఆయా వార్డు, గ్రామ సచివాలయాల్లో ఇచ్చే ఏర్పాట్లు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు.

డిసెంబర్‌లో 61.69 లక్షల మందికి పంపిణీ
డిసెంబర్‌ ఒకటి నుంచి మూడురోజులు 61,69,832 మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,510.90 కోట్లను రాష్ట్రంలోని అన్ని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాల్లో సోమవారం జమచేశారు. వరుసగా మూడునెలలు పింఛను తీసుకోని వారికి నిబంధనల ప్రకారం పింఛను తాత్కాలికంగా నిలిపేసి, మళ్లీ పరిశీలన అనంతరమే కొనసాగించాల్సి ఉంది. అలాంటి వారికీ ఊరట కలిగిస్తూ.. వరుసగా మూడునెలలు పింఛను తీసుకోని 7,462 మందికి మూడునెలల బకాయిలతో కలిపి ఈనెల డబ్బులను పంపిణీ చేయనున్నారు.
.

మరిన్ని వార్తలు