పరిశ్రమలకు పుష్కలంగా నీరు

7 Mar, 2021 03:22 IST|Sakshi

ప్రత్యేకంగా ఏపీ ఇండస్ట్రియల్‌ వాటర్‌ సప్లై కంపెనీ ఏర్పాటు 

కొత్తగా ఏర్పాటయ్యే పార్కులకు రోజుకు 288 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం

వీటికి నీటి సరఫరా కోసం రూ.2,000 కోట్లతో పనులు

ఇప్పటికే కొన్ని పార్కులకు నీటి సరఫరా కోసం డీపీఆర్‌లు సిద్ధం 

వివిధ రిజర్వాయర్ల నుంచి నీటిని తరలించేలా ఏపీఐఐసీ ప్రణాళికలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు తగినంత నీరు అందించేలా ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే పరిశ్రమలు ఒప్పందం కుదుర్చుకునే సమయానికే అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏపీఐఐసి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కులను ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు వివిధ రిజర్వాయర్ల నుంచి నీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేసింది. ఈ ప్రాజెక్టులకు నీటి సరఫరా కోసం సుమారు రూ.2,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఇందుకోసం ఏపీ ఇండస్ట్రియల్‌ వాటర్‌ సప్లై పేరుతో ప్రత్యేకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం విశాఖ నగర వాసులతో పాటు అక్కడి పరిశ్రమలకు నీటిని అందించడానికి జీవీఎంసీతో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం ఇండస్ట్రియల్‌ వాటర్‌ సప్లై కంపెనీ (విస్కో) సేవలను రాష్ట్రమంతటా విస్తరించే యోచనలో ఉన్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కొన్ని ప్రాజెక్టులకు ఈ నెలాఖరులోగా, మరికొన్నింటికి 2022లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

రోజుకు 288 మిలియన్‌ లీటర్ల నీరు
రాష్ట్రంలో చేపడుతున్న వివిధ పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటయ్యే కంపెనీలకు రోజుకు 288 మిలియన్‌ లీటర్ల నీరు అవసరమవుతుందని ఏపీఐఐసీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఏ పారిశ్రామిక పార్కుకు ఏ రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించాలి.. అందుకు అయ్యే వ్యయం ఎంత.. అన్నది లెక్క తెల్చారు. కొప్పర్తి పారిశ్రామిక పార్కుకు సోమశిల నుంచి, ఓర్వకల్లుకు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ద్వారా.. కృష్ణపట్నం, నాయుడుపేట, చిత్తూరు జిల్లాలోని పార్కులకు కండలేరు నుంచి.. విశాఖకు గోదావరి జలాలను.. అనంతపురానికి హంద్రీ–నీవా నుంచి పైప్‌లైన్ల ద్వారా నీటిని తరలించనున్నారు. అదే విధంగా పారిశ్రామిక అవసరాలకు సముద్రపు నీటిని వినియోగంచుకునే విధంగా కృష్ణపట్నం వద్ద పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 10 మంది సభ్యులతో నిపుణుల కమిటీని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

చౌకగా నీటిని అందిస్తాం 
రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు ఇతర రాష్ట్రాలకంటే తక్కువ రేటుకే నీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసి, దాని ద్వారానే రాష్ట్రంలోని అన్ని కంపెనీలకు నీటిని అందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అవాంతరాలు లేకుండా నీటిని పుష్కలంగా అందిస్తే కిలో లీటరుకు ఎంత ధరైనా చెల్లించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల కంటే చౌకగా నీటిని అందించే విధంగా ఏపీఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది.
– కే.రవీన్‌ కుమార్‌ రెడ్డి, వీసీ, ఎండీ, ఏపీఐఐసీ

మరిన్ని వార్తలు