పోలవరంలో హైస్పీడ్‌లో కీలక నిర్మాణం పూర్తి

26 Feb, 2021 21:15 IST|Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడిగా మారనున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులను పరుగెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలవరం పనుల్లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే బ్రిడ్జి స్లాబ్‌ నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ స్పిల్‌వే బ్రిడ్జి స్లాబ్‌ పొడవు 1,128 మీటర్లు ఉంది. 2020 సెప్టెంబర్‌ 9వ తేదీన మొదలైన పనులు కొన్ని నెలల్లోనే పూర్తవడం విశేషం.

ఈ స్పిల్‌వే స్లాబ్‌ నిర్మాణానికి 5,200 క్యూబిక్‌ మీటర్లకుపైగా కాంక్రీట్‌, 700 టన్నులకుపైగా స్టీల్‌ను వినియోగించారు. వరదలు, కరోనా పరిస్థితులను ఎదుర్కొని అనుకున్న సమయానికి పనులు పూర్తి కావడం గమనార్హం. పోలవరం ప్రాజెక్ట్‌ పనులను నిరంతరం సీఎం జగన్‌ పర్యవేక్షిస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. పక్కా ప్రణాళికతో వరదల సమయంలోనూ పనులు ఆగలేదు. పిల్లర్లపై 192 గడ్డర్ల అమరిక, స్లాబ్‌ నిర్మాణం పూర్తయ్యింది. ఓవైపు బ్రిడ్జి నిర్మాణం చేస్తూనే చకచకా గేట్ల ఏర్పాటు పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 29 గేట్లు అమర్చడంతోపాటు హైడ్రాలిక్‌ సిలిండర్ల అమరిక పనులు మొదలయ్యాయి. పనులు వేగంగా చేసి వచ్చే ఏడాది పోలవరం జాతికి అంకితం చేసేలా సీఎం జగన్‌ పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు