కాసుల వర్షం కురిపిస్తోన్న ‘తెల్ల బంగారం’

13 Jul, 2022 11:49 IST|Sakshi
ఉప్పు కొఠారులు

75 కేజీల ఉప్పు బస్తా ధర రూ.300

50 ఏళ్లలో ఇదే అత్యధిక ధర

ఆనందంలో ఉప్పు రైతులు

ప్రకాశం జిల్లాలో 4 వేల ఎకరాల్లో సాగు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉప్పురైతుల దశ తిరిగింది. వాతావరణం పూర్తిగా అనుకూలించడంతో ఉప్పుసాగు జోరుగా సాగుతోంది. ధరలు సైతం ఊహించని విధంగా పెరగడంతో తెల్ల బంగారం కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు నాలుగేళ్ల కిందట 75 కేజీల బస్తా ధర కేవలం రూ. 70 మాత్రమే ఉండేది. ప్రస్తుతం రూ. 300 పలుకుతోంది. యాబై ఏళ్లలో ఇంత ధర ఎప్పుడూ లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. 


సింగరాయకొండ:
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం, కనపర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీల్లోని కొఠారుల్లో సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగవుతోంది. వర్షాకాలం మినహా మిగిలిన కాలాల్లో దాదాపు 9 నెలల పాటు ఉప్పు సాగు చేస్తారు. ప్రతి నెల సుమారు 20 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి అవుతోంది. సుమారు 7 వేలకు పైగా ఉప్పు రైతులు, 10 వేలకు పైగా కూలీలకు ఉపాధి పొందుతున్నారు.


50 ఏళ్లలో అత్యధికం 

ప్రస్తుతం ఉప్పు ధర నాణ్యతను బట్టి 75 కేజీల బస్తా రూ.300 వరకు పలుకుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.270 పలికింది. ఇదే అత్యధిక ధర అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు ధరలు మరింత పెరిగాయి. ఈ ఏడాది తమిళనాడులో అధిక వర్షాలతో ఉప్పు ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దీంతో తమిళనాడు వ్యాపారులు రాష్ట్రానికి రావడంతో ఏప్రిల్‌లో ధరలు బాగా పెరిగాయి. మూడు నాలుగేళ్ల కిందట 75 కేజీల బస్తా రూ.75 లకు కూడా ధర రాని దుస్థితి. దీంతో చాలా మంది ఉప్పు రైతులు సాగుకు సెలవు ప్రకటిద్దామనుకున్నారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ధరలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ధర రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంతో పాటు, తెలంగాణ, మహారాష్ట్ర  ఉప్పు సరఫరా అవుతోంది. 


పెరిగిన కూలి
 
ఉప్పు ధరలు ఆశాజనకంగా ఉండటంతో కూలీలకు కూలి సైతం పెరిగింది. ఇప్పటి వరకు కొఠారుల్లో మూడు గంటలు పనిచేస్తే పురుషులకు రూ.400 ఇస్తుండగా ప్రస్తుతం రూ.500, మహిళలకు రూ.300 ఇస్తుండగా రూ.350 పెరిగిందని రైతులు తెలిపారు.  


ఇతర రాష్ట్రాల వ్యాపారుల రాకతో.. 

ఈ ప్రాంతంలో వ్యాపారుల సిండికేట్‌ కారణంగా ఉప్పు రైతులకు ఆశించిన ధర చేతికి వచ్చేది కాదు. కానీ ఈ ఏడాది తమిళనాడు వ్యాపారులు నేరుగా రైతులను కలవడంతో ధరలు ఆశాజనంగా పెరిగాయని ఉప్పు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల వ్యాపారులు నేరుగా రావటంతో ఇప్పటివరకు సిండికేట్‌తో వ్యాపారులు లాభపడుతుండగా ఇప్పుడు రైతులే ఆ లాభాలను పొందుతున్నారు. ఉప్పును కూడా ఆర్‌బీకేల కొనుగోలు చేస్తే మరింత లాభం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ధరలు ఆశాజనకంగా ఉన్నాయి
10 ఎకరాలను కౌలుకు తీసుకొని ఉప్పు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉప్పు తయారీ బాగుంది. తమిళనాడు వ్యాపారులు నేరుగా రైతులను కలవడంతో మంచి ధరలు వస్తున్నాయి.
– పురిణి శ్రీనివాసులరెడ్డి 

గతంలో ఎప్పుడూ ఈ ధర లేదు
50 ఏళ్లలో ఎన్నడూ ఈ ధర లేదు. గతంలో వ్యాపారుల సిండికేట్, వర్షాభావ పరిస్థితులతో గిట్టుబాటు ధరలు రాక తీవ్రంగా నష్టపోయేవాళ్లం. రెండేళ్లుగా ధరలు ఆశాజ నకంగా ఉండటంతో సాగు లాభదాయకంగా ఉంది.
– కుర్రి నరసింహారావు

మరిన్ని వార్తలు