1.07 లక్షల హెక్టార్లలో పంటలు మునక

17 Oct, 2020 04:51 IST|Sakshi

వర్షాలు, వరదలతో నష్టంపై ప్రాథమిక అంచనా

వివిధ శాఖలకు రూ.1,375 కోట్లకుపైగా నష్టం

సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నీట మునిగి రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో 1,07,859 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నట్లు  జిల్లాల నుంచి అందిన ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 47,745 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. వరి పంట కోతకు వచ్చిన దశలో నీటి పాలు కావడంతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. వరదల వల్ల రహదారులు, భవనాల శాఖకు రూ.1,288.96 కోట్లు, జలవనరుల శాఖకు  రూ.31.50 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.16.13 కోట్లు, ఇంధన శాఖకు రూ. 0.20 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖకు రూ.38.08 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా శాఖకు రూ.0.45 కోట్లు కలిపి మొత్తం రూ.1,375.32 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 

171 మండలాలపై ప్రభావం
భారీ వర్షాలు, వరదల ప్రభావం 171 మండలాలపై పడింది. 902 గ్రామాలు ప్రభావితమయ్యాయి. 28, 927 ఇళ్లు నీట మునిగాయి.  1336 ఇళ్లు కూలిపోయాయి. వివిధ సంఘటనల్లో 14 మంది చనిపోయారు. వరదల నేపథ్యంలో ప్రభుత్వం 123 సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలకు చెందిన 7,853 కుటుంబాలను తరలించింది. 32,823 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన సదుపాయం కల్పించింది.  

మరిన్ని వార్తలు