మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటి ముందు నిరసన

14 Jan, 2023 09:45 IST|Sakshi

ఆళ్లగడ్డ(నంద్యాల): తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలంటూ టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటి ముందు బంధువులంతా ఎకమై నిరసన తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భూమా నాగిరెడ్డి, శోభనాగిరెడ్డి ఉన్న కాలంలో బంధువుల వద్ద సుమారు రూ.8 కోట్లు అప్పుగా తీసుకున్నారు. వారు చనిపోయిన తర్వాత అప్పులు చెల్లించాలని వారసురాలైన అఖిలప్రియను అడుగుతుంటే సరైన సమాధానం ఇవ్వకపోవడంతో గురువారం రాత్రి అందరూ కలిసి ఆమె ఇంటికి వెళ్లారు.

అప్పులు తిరిగి చెల్లించాలని గొడవపడ్డారు. మీకు ఎలాంటి బాకీ లేనని, తాను ఏమైనా రాసిచ్చిన పత్రాలు ఉంటే చూపాలని అఖిలప్రియ అనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు మధ్యవర్తులు బంధువులను సముదాయించి బయటకు తీసుకొచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం మరి కొందరు బంధువులు తోడై అందరూ కలిసి అఖిలప్రియ ఇంటి మీదకు వెళ్లడంతో మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో పట్టణ ఎస్‌ఐ వెంకటరెడ్డి అక్కడికి చేరుకొని అఖిలప్రియ బంధువులకు సర్దిచెప్పారు. అయినప్పటికీ, బాధితులు అఖిలప్రియ ఇంటి ఎదుట నిరసన కొనసాగించారు.  

మరిన్ని వార్తలు