Rishab Shetty: అలా చేయడం పద్ధతి కాదు.. గోవా వేదికగా రిషబ్ కామెంట్స్!

29 Nov, 2023 06:59 IST|Sakshi

కన్నడ హీరో, కాంతార ఫేమ్ రిషబ్‌ శెట్టి గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం కాంతార సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే  'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్‌ గ్లింప్స్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో రిషబ్‌ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపించాడు. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.

అయితే తాజాగా ఆయన గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(ఇఫి) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటీటీలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్‌ఎఫ్‌డీసీ ఫిల్మ్‌ బజార్‌లాంటి వేడుకల్లో ప్రదర్శితమైతే కన్నడ చిత్రాలకు రెవెన్యూ వచ్చేదని.. కొవిడ్‌ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వినియోగం పెరగడంతో ఆ పరిస్థితి లేదని అన్నారు. అలాగే కన్నడలో తెరకెక్కిన ఓ కమర్షియల్‌ సినిమా సక్సెస్‌ కాకపోతే ఓటీటీ సంస్థలు తిరస్కరించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. తనకు కన్నడ చిత్ర పరిశ్రమను వీడే ఉద్దేశం లేదని తెలిపారు. 

రిషబ్ మాట్లాడుతూ..' కాంతార సూపర్ హిట్ తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. వాటిని నేను తిరస్కరించా. కన్నడ ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. కంటెంట్‌ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రస్తుతం కాంతార ఏ లెజెండ్‌: చాప్టర్‌ 1 పైనే దృష్టి సారించాం. కాంతార తీసే సమయంలోనే ప్రీక్వెల్‌ ఆలోచన వచ్చింది. మూవీ హిట్ ‌కావడంతో ప్రీక్వెల్‌ తీయాలని నిర్ణయించుకున్నా' అని అన్నారు. కాగా.. ఇఫి వేడుకల్లో కాంతారకు సిల్వర్‌ పీకాక్‌(స్పెషల్ జ్యూరీ అవార్డ్) దక్కింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ట్వీట్ చేసింది. 

మరిన్ని వార్తలు