బంగాళాఖాతంలో అల్పపీడనం

20 Sep, 2022 08:31 IST|Sakshi

నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు

ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు\

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షపాతం

ఏలూరు నగర ప్రజలకు సర్కార్‌ రక్షణ గోడ.. తప్పిన ముంపు సమస్య

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/సాక్షి, రాజమహేంద్రవరం: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఇది కొనసాగుతోంది. ఇది మంగళవారం నాటికి మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఆ తర్వాత ఒడిశా మీదుగా మధ్యప్రదేశ్‌ వైపు ప్రయాణించి క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపాయి. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. తీరం వెంట గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. మిగిలిన కోస్తా జిల్లాల్లో, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
అల్పపీడన ప్రభావంతో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురిశాయి. ఏలూరు నగరంతోపాటు దెందులూరు, ఉంగుటూరు, కైకలూరు నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం ఉదయం దాదాపు మూడు గంటల పాటు కుండపోతగా వర్షం కురవడంతో రహదారులు ఏరులను తలపించాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి.

ఏలూరు జిల్లాలో సోమవారం ఉదయం 8.30 నుంచి రాత్రి వరకు ఆయా మండలాల్లో కురిసిన వర్షపాతం ఇలా ఉంది.. ఏలూరు 113.6, వేలేరుపాడు 46.2, దెందులూరు 26.4, టి.నర్సాపురం 26, కుక్కునూరు 24.6, భీమడోలు 24, లింగపాలెం 22.8, చాట్రాయి 21.2, కొయ్యలగూడెం 20, పెదవేగి 18.6, ముసునూరు 18.4, కైకలూరు 18.4, కలిదిండి 17.2, నూజివీడు 16.8, ముదినేపల్లి 16.4, ద్వారకా తిరుమల 15.4, నిడమర్రు 15.2, మండవల్లి 14.6, గణపవరం 13.4, చింతలపూడి 13.2, పోలవరం 13.2, బుట్టాయగూడెం 12.6, కామవరపుకోట 12.4, పెదపాడు 10.6, ఉంగుటూరు 10.4, జంగారెడ్డిగూడెం 10.2, జీలుగుమిల్లి 7.8, ఆగిరిపల్లి 5.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 15.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ విస్తారంగా వానలు పడ్డాయి. తూర్పుగోదావరిలో సగటు వర్షపాతం 9.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. కాకినాడ జిల్లా తీర మండలాల్లోనూ భారీ వర్షం పడింది. 

ఏలూరు ముంపు ప్రాంతాల సమస్యకు ప్రభుత్వం చెక్‌
గతంలో వర్షాకాలం వస్తోందంటే ఏలూరు నగర ప్రజలు గుండెలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి వారిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బయటపడేసింది. ఏలూరు నగరాన్ని దాదాపు చుట్టి ఉన్న తమ్మిలేరుకు ఏటా వర్షాకాలంలో వరదలు వచ్చేవి. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నగర ప్రజల సమస్యను నాటి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని వైఎస్సార్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై వైఎస్సార్‌ తక్షణమే స్పందించి తమ్మిలేరు ఏటిగట్టును పటిష్టపరచడానికి రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వెంటనే నిధులను కూడా విడుదల చేశారు. రూ.78 కోట్ల అంచనా వ్యయంతో తమ్మిలేరు ఏటిగట్టుకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు ప్రారంభించారు.

కొంతమేర రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు జరిగాయి. అనంతరం వైఎస్సార్‌ ఆకస్మిక మరణం, అనంతరం వచ్చిన ప్రభుత్వాలతోపాటు గత టీడీపీ ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని నిలిపివేశాయి. దీంతో నగర ప్రజల కష్టాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆళ్ల నానిని ఉప ముఖ్యమంత్రి పదవిలో నియమించారు. దీంతో తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వడివడిగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏలూరు అశోక్‌నగర్‌ నుంచి వైఎస్సార్‌ కాలనీ వరకు 4.3 కిలోమీటర్ల మేర తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పూర్తయింది. మరో 700 మీటర్ల మేర పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. దీంతో నగర ప్రజలకు తమ్మిలేరు వరద ప్రమాదం తొలగిపోయింది. అదేవిధంగా కృష్ణా వరదలతో విజయవాడ నగరంలోని కృష్ణలంక, రామలింగేశ్వర నగర ప్రాంతాలకు కూడా గతంలో వరద ముప్పు పొంచి ఉండేది. ఈ సమస్యకు కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిష్కారం చూపింది. కృష్ణాలో ఆ ప్రాంతాలకు వరదల నుంచి రక్షణకు గోడ నిర్మించింది. 

మరిన్ని వార్తలు